‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన మద్దతుతో పోటీ చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తర్వాత ‘ఆయన ఏమీ చేయలేదు’ అంటూ విమర్శించే వారు కూడా లేకపోలేదు .ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి మనం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈసారి ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనకి మెగాస్టార్ సపోర్ట్ ఉందని.. మరోవైపు పోటీ చేసే విష్ణుకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ప్రచారం జరుగుతుంది.
ఈ విషయాల పై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించి తన దైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ” ఈ విషయంలో చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారో.. నాకు అర్థం కావడం లేదు. ఎన్నికలు అనేది చాలా సున్నితమైన విషయం. కేవలం 800 మంది సభ్యుల సమూహం కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి. దాన్ని ఇంత పెద్ద వ్యవహారంగా చూడొద్దు. కళాకారులంటే సున్నితమైన మనసున్నవాళ్లు అని నేను నమ్ముతాను. వాళ్ల వ్యవహారాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు? మేమంతా ఒకే కుటుంబం.
ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేసినా, ఫైనల్ గా అందరం కలిసి పనిచేసుకోవాల్సిందే. అలాగే ఆర్టిస్ట్ లకు లోకల్, నాన్ లోకల్ అనేది ఉండదు. వాళ్లు యూనివర్సల్. గత ఎన్నికలలో ఇలాంటి ప్రస్తావన రాలేదెందుకు?ఇప్పుడెందుకు వచ్చింది? కాస్త ఆలోచించండి. నా సహాయకులకు ఇల్లు కట్టించినప్పుడు,రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు, ఏడు నందులు, జాతీయ అవార్డులు తీసుకున్నప్పుడు.. నన్ను నాన్ లోకల్ అనలేదే.! ఇప్పుడే ఎందుకు” అంటూ ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.