ఈ మధ్యనే ‘కోర్ట్’ తో అలరించిన ప్రియదర్శి (Priyadarshi) .. వెంటనే ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ (Mohana Krishna Indraganti) దర్శకత్వం వహించిన సినిమా ఇది.శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మాత. ఈ సినిమాలో సారంగపాణి అనే లీడ్ రోల్ పోషిస్తున్నాడు ప్రియదర్శి. ఇందులో హీరో పాత్రకి జాతకాల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల హీరో జీవితంలో చోటు చేసుకున్న అనుకున్న సంఘటనలు ఏంటి? అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రియదర్శి నిజ జీవితానికి ఈ సినిమా ఎంతవరకు దగ్గరగా ఉంటుంది అనే అంశంపై కూడా అతను స్పందించాడు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్…’ఎవరైనా మీ జాతకం చూసి మీరు పెద్ద స్టార్ హీరో అవుతారు అని ఎవరైనా చెప్పారా?’ అంటూ ప్రియదర్శిని ప్రశ్నించాడు. అందుకు ప్రియదర్శి బదులిస్తూ… “నా జాతకం చూసి నేను యాక్టరే కానని చెప్పారు.
అది నేను సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొద్ది రోజులు చాలా బాధపడ్డాను. నాకేం కావాలో నేను చేస్తాను. అంతే కానీ ఎక్కడో గ్రహాలు అవి కలవలేదు అనేది నేను నమ్మను. సూపర్స్టిషన్ అయినా, నమ్మకం అయినా మనకెంత ఉపయోగపడుతుంది అనేది మనకు ముఖ్యం. నా వ్యక్తిగతంగా నేను నమ్మేది ఒక్కటే. నా వ్యక్తిగత ఇంగిత జ్ఞానమే చాలా గొప్పది, నా కామన్ సెన్స్ నాకు ముఖ్యమని ఫీలవుతాను. అది దాటి ఏదో అవుతుంది అంటే నేను నమ్మను” అంటూ చెప్పుకొచ్చాడు.