ప్రియాంక చోప్రా (Priyanka Chopra) బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ బ్యూటీ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ ప్రాజెక్టుల మధ్య మళ్లీ భారతీయ సినిమాపై ఫోకస్ పెట్టిన ప్రియాంక, ఇప్పుడు SSMB29 కోసం హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) – మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక ఓ కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం.
ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణలో పాల్గొన్న ఆమె, దీని కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట. ఇక SSMB29 షూటింగ్ పూర్తి కాకుండానే, ప్రియాంక మరిన్ని ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బాలీవుడ్‌లో ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్‌లో రూపొందే జీలే జరా ప్రాజెక్ట్‌ను ప్రియాంక ముందుగా ఓకే చేసినప్పటికీ, అనివార్య కారణాలతో ఆలస్యం అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె కత్రినా కైఫ్, ఆలియా భట్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేయనుంది.
అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, ప్రియాంక మరో హాలీవుడ్ ప్రాజెక్ట్ హెడ్స్ అప్ స్టేట్జ్ కు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె ప్రముఖ హాలీవుడ్ నటులతో కలిసి నటించనుందని టాక్. అలాగే, ఇప్పటికే ఆమె నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరో కథ కూడా రెడీ అవుతోంది. ఇది విడుదల తర్వాత ఆమెకు మరిన్ని ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. SSMB29 ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఇది సాధారణ సినిమా కాదని, ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది.
విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రావొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. దీంతో ప్రియాంక ఇందులో మరింత ప్రాముఖ్యతగల పాత్ర పోషించే అవకాశముంది. మొత్తానికి ప్రియాంక హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. SSMB29 ఆమెకు ఇండియన్ మార్కెట్‌లో మరింత క్రేజ్ తీసుకురావడం ఖాయం. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.