పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్, హంగామా, సందడి… ఒక్కటేంటి ఇలాంటివి చాలానే ఉన్నాయి. అయితే ఇదంతా తెలంగాణలో ఉన్న అభిమానులకు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్ ఎలా ఉంటుంది, థియేటర్ల దగ్గర ఎలాంటి హంగామా నడుస్తుంది అనేది అర్థం కావడం లేదు. ‘వకీల్ సాబ్’ నాటి పరిస్థితులు తలెత్తుతాయా అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ స్పందించాఉ.
‘బ్రో’ (Bro Movie) సినిమాలో ఏపీలో రిలీజ్ చేసే పరిస్థితులు గురించి చాలా రకాల వార్తలు, పుకార్లు వినిపిస్తున్నాయి. అయినా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఈ సినిమాపై రాజకీయ ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదు. ‘వకీల్‌సాబ్’ సినిమా విడుదల సమయంలో ఏపీలో టికెట్ రేట్లు, థియేటర్ల దగ్గర సమస్య వచ్చిందని విన్నాను. అయితే అప్పుడు అలా జరిగిందని, ఇప్పుడూ అదే జరుగుతుంది అనుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా దాన్ని మేం పరిష్కరించుకుంటాం అని చెప్పారు విశ్వప్రసాద్.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 25న హైదరాబాద్‌లో నిర్వహిస్తామని చెప్పారు. సినిమాను సిద్ధం చేసిన ప్లానింగ్ గురించి కూడా విశ్వప్రసాద్ స్పందించారు. ఇతర సినిమాల్లాగే పవన్ కల్యాణ్ మా సినిమాకూ డేట్స్ ఇచ్చారు. మేం పక్కా ప్రణాళికలతో మా సినిమాను అనుకున్న సమాయానికి పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పారు. నిర్మాణం, వ్యాపారం పరంగా ‘బ్రో’ సినిమా సంతృప్తినిచ్చిందని చెప్పారు.
ఇక ఈ సినిమా విషయానికొస్తే పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ మరో ముఖ్య పాత్రధారులు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన అందించారు. ఈ నెల 28న సినిమాను విడుదల చేస్తున్నారు.