“బాహుబలి” అనంతరం కొన్నాళ్లప్పాటు తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్ గా ఎన్టీయార్ & రామ్ చరణ్ తో కలిసి సోఫాలో కూర్చున్న ఒక ఫోటోను తన ట్విట్టర్ లో పెట్టి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు మన జక్కన్న. ఆ తర్వాత మెల్లగా “ఆర్.ఆర్.ఆర్” అంటూ ఓ భారీ ఎనౌన్స్ మెంట్ ను సైతం సైలెంట్ గా రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు రాజమౌళి. ఇక రామ్ చరణ్-ఎన్టీయార్ కలిసి నటించబోతున్నారు అని తెలిసేసరికి టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలిద్దరూ కలిసి నటించడం అంటే అంత చిన్న విషయం కాదు.
ఇక అప్పట్నుంచి సినిమా గురించి రకరకాల స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. మొదట బాలీవుడ్ చిత్రం “బ్రదర్స్” రీమేక్ అని వార్తలొచ్చాయి. తర్వాత ఇది పోలీస్ స్టోరీ అని కథనాలు వెలువడ్డాయి, ఇక రీసెంట్ గా ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడంటూ కొన్ని ప్రముఖ పత్రికలు కూడా రాయడంతో అప్రమత్తమైన నిర్మాత డి.వి.వి.దానయ్య స్పందిస్తూ.. “ఇప్పటివరకూ కథ ఏమిటనే విషయంలో ఇంకా రాజమౌళి గారు కూడా ఫైనల్ అవ్వలేదు. మా హీరోలకి కూడా కథ చెప్పలేదు. అందుకే ఇష్టమొచ్చినట్లు కథనాలు సృష్టించకండి” అంటూ చిన్నసైజు విన్నపం చేశాడు. అలాగే.. ఒక నెలలో సినిమా జోనర్ ఏమిటి అనే విషయంలో క్లారిటే ఇస్తానని కూడా దానయ్య పేర్కొనడం విశేషం.