ఏ తెలుగు సినిమాకూ రాని ట్రోల్స్ ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో వచ్చాయి. ఈ మాట మేం అనడం లేదు.. చిత్రబృందమే చెప్పింది. సినిమా విడుదలై, విజయం అందుకున్న వెంటనే టీమ్ దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. కథానాయకుడు చిరంజీవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమా మీద వచ్చిన ట్రోలింగ్స్, నెగిటివ్ వార్తల గురించి మాట్లాడారు. తాజాగా మరోసారి ఎన్వీ ప్రసాద్ వీటిపై స్పందించారు. ‘ట్రోలింగ్స్ గురించి, నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడితే.. ఈ రోజంతా చాలదు’ అంటూ గట్టిగానే సమాధానమిచ్చారు ఎన్వీ ప్రసాద్.
సినిమా విడుదలకు ముందు వార్తలు వచ్చినట్లు… ప్రమోషన్స్ విషయంలో మేమేం వెనుకబడలేదు అని చెబుతూ.. సినిమా విడుదలకు ముందు ఏమైందో వివరించారు ఎన్వీ ప్రసాద్. సెప్టెంబరు 25 వరకు సినిమా షూటింగ్ జరిగిందని, అక్టోబరు 1 వరకు తమన్ సినిమా రీరికార్డింగ్ చేశాడని వివరించారు ఎన్వీ ప్రసాద్. ఆ వీడియోను చెన్నై నుండి హైదరాబాద్ తీసుకొచ్చి, ప్రాసెస్ చేసి… క్యూబ్‌కి పంపించామని.. అలా నిద్రలు లేకుండా పని చేడయం వల్ల పండగ రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు.
సోషల్ మీడియాలో మాపై, మా సినిమాపై మొదటి నుంచీ ట్రోల్స్ వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. మా సినిమాకు ప్రచారం కూడా సరిగా చేయడం లేదన్నారు. అయితే మా కష్టం వారికి తెలియదు కదా అని అన్నారు ఎన్వీ ప్రసాద్. కొన్ని రోజుల క్రితం చిరంజీవి కూడా ఇదే మాట అన్నారు. మా సినిమా విషయంలో రిలీజ్ ముందు చాలా మాటలు అన్నారని, ఆ తర్వాత మీడియా మా సినిమాను మెచ్చుకుందని చెప్పారు.
ఇప్పుడు ట్రోలర్స్ విషయంలోనూ ఇలానే అంటారేమో చూడాలి. ఎందుకంటే సినిమా వచ్చాక మార్పులు, చేర్పుల విషయంలోనూ కొన్ని మంచి పోస్ట్‌లు కనిపించాయి. మరి వాటి గురించి చిత్రబృందం తర్వాతైనా స్పందిస్తుందేమో చూడాలి. సినిమా పరిస్థితి ఇదీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న తేదీకి తెచ్చేస్తాం అని ట్రోలింగ్ సమయంలో చెప్పుంటే ఈ సమస్య వచ్చేదే కాదు అనే వాదన కూడా వినిపిస్తోంది.