1980-1990లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెరపై రౌద్రాన్ని అద్భుతంగా పండించిన రాజశేఖర్ తదనంతర కాలంలో కథానాయకుడిగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడు. రాజశేఖర్ కు ఆఖరి సూపర్ హిట్ అంటే “ఎవడైతే నాకేంటి” అని చెప్పుకోవచ్చు. అటువంటి అవుట్ డేటెడ్ హీరో అయిన రాజశేఖర్ పై పది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికే దర్శకనిర్మాతలు సంకోచిస్తున్న ఈ తరుణంలో “గరుడవేగ” నిర్మాతలు ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మరి ఏ నమ్మకంతో వారు ఈరేంజ్ లో రిస్క్ చేశారు అనేది వారికే తెలియాలి.
పోనీ.. డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో అంత ఖర్చు చేశారా అంటే అదీ కాదు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పటివరకూ తీసిన సినిమాలు “ఎల్బీడబల్యూ, రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూరు టాకీస్” సినిమాల్లో గుంటూరు టాకీస్ ఒక్కటే కమర్షియల్ సక్సెస్ సాధించింది. అది కూడా బోల్డ్ కంటెంట్ అండ్ రష్మీ అందాల ప్రదర్శన పుణ్యమా అని. ఆ సినిమా కూడా కేవలం రెండున్నర కోట్ల రూపాయల మీడియం బడ్జెట్ తో రూపొందిన చిత్రం. సో, ఏ యాంగిల్ లో చూసినా సరే నిర్మాతలు “గరుడ వేగ” సినిమా కోసం 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో సెన్స్ కనిపించడం లేదు. మరి.. ప్రవీణ్ సత్తారు నిర్మాతల చేత అంత ఖర్చు చేయించడానికి ఏం చెప్పి ఒప్పించాడు? మరి నిర్మాతలు అంత నమ్మకం పెట్టుకొన్న కథ ఎంతవరకూ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది అనేది తెలియాలంటే నవంబర్ 3 వరకూ ఆగాల్సిందే.