కోవిడ్ కారణంగా రిలీజ్ లు వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలు ఇప్పుడు వరుసగా థియేటర్లలో దర్శనమిస్తున్నాయి. రెండు వారాలకి ఓ పెద్ద సినిమా థియేటర్లో వస్తుంది. అయితే ఇందులో హిట్ అనిపించుకున్న సినిమాలు ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మాత్రమే. మిగిలిన పెద్ద సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ యావరేజ్ కాగా, ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ చిత్రాలు ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి. అందుకు కారణం టికెట్ రేట్ల పెంపుదల అనే చెప్పాలి.
తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. ‘రాధే శ్యామ్’ అంటే పాన్ ఇండియా సినిమా. పైగా రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా కాబట్టి.. టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు. అయితే ‘ఆచార్య’ నిర్మాతలు కూడా రూ.50 కోట్లు అదనంగా వడ్డీలు కట్టాము అంటూ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. అందుకు ప్రభుత్వం కూడా ఓకే చేసింది. అయితే జనాలు మాత్రం అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
తెలంగాణలో ఇప్పుడు మల్టిప్లెక్స్ లలో టికెట్ రేట్లు రూ. 413, రూ.354 ఉన్నాయి. జీఎస్టీలు వంటి వాటితో కలుపుకుంటే ఇంకో రూ.50 ఎక్కువవుతుంది. సినిమాకి ఓ ఫ్యామిలీ(4 మంది) వెళ్ళాలి అంటే రూ.1500 వరకు అవుతుంది. ఇంకా ఎక్కువే అవుతుంది కూడా..! సింగిల్ స్క్రీన్స్ వల్ల కూడా రూ.1000 వరకు పెట్టాలి. ఇవి మధ్య తరగతి కుటుంబానికి భారం. అందుకే ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ సినిమాలకి టికెట్లు తెగలేదు.
ఇప్పుడు ఇదే తప్పు కనుక ‘సర్కారు వారి పాట’ టీం చేసింది అంటే ఫలితం కూడా ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ సినిమాల్లానే ఉండే ప్రమాదం ఉంది. అయితే ‘సర్కారు’ వారి టైంకి పరీక్షలు అయిపోతాయి. విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి. అదొక అడ్వాంటేజ్ ఉంది. మరి ‘సర్కారు వారి పాట’ టీం టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.