సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయడానికి నిర్మాత (Producers), దర్శకుడు, టెక్నికల్ టీం చాలా కష్టపడుతుంటారు. ఫస్ట్ కాపీ పంపేవరకు వాళ్ళకి ఉండే తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు ఆ ఫస్ట్ కాపీ పంపిన తర్వాత కూడా ఎక్కడా లేని తల నొప్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ కాపీ… పంపడం పెద్ద రిస్క్ గా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల కోసం ఓవర్సీస్ కు పంపే కాపీలు పైరసీ బారిన పడుతున్నాయి.
‘గేమ్ ఛేంజర్’ (Game Chnager) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ఇప్పుడు ‘హిట్ 3’ వంటి సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే… పైరసీకి గురయ్యాయి. వీటి హెచ్.డి ప్రింట్లు ఆన్లైన్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. ఇటీవల నాగవంశీ ఈ విషయాన్ని మీడియా ముందు డైరెక్ట్ గా వెల్లడించారు. ‘ ‘మ్యాడ్ స్క్వేర్’ ఓవర్సీస్ కాపీ పైరసీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఆ వెర్షన్ లేదు. రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ఇలాగే పైరసీ బారిన పడుండొచ్చు’ అంటూ నాగవంశీ (Suryadevara Naga Vamsi) తెలిపారు.
‘ఇండస్ట్రీ పై పైరసీ ప్రభావం గట్టిగా ఉంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే కష్టం.నా ఒక్కడితో ఇదంతా అయ్యేది కాదు’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. ‘హిట్ 3′(HIT 3) సినిమా తొలి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్స్ కి సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది అని అనుకుంటే… అలా జరగలేదు.
అందుకు మెయిన్ రీజన్ పైరసీ అనడంలో సందేహం లేదు. అసలే జనాలు థియేటర్ కు రావడం లేదు అని… దర్శక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాధపడుతుంటే పైరసీ వారికి మరో తలనొప్పిగా మారింది. దీనిపై వారు వెంటనే దృష్టిసారించాలి.