కథ లేని సినిమాను చూసుంటారు, హీరో లేని సినిమాను చూసుంటారు, హీరోయిన్ లేని సినిమాను చూసుంటారు కానీ ప్రేక్షకుడు లేని సినిమాను చూడలేరు. ఒకవేళ అలాంటి పరిస్థిత వస్తే ఆ సినిమా థియేటర్‌లో ఉండదు. అలాగే వక్త లేని ప్రెస్ మీట్ ఉండదు, మీడియా లేని మీడియా సమావేశం ఉండదు. కానీ టాలీవుడ్‌లో అలాంటి ప్రెస్ మీట్ ఒకటి జరిగింది. అందులోనూ ఇండస్ట్రీలో జరుగుతున్న హాట్ టాపిక్ గురించి ఆ ప్రెస్ మీట్‌లో చెప్పారు.
సినిమా కష్టాల గురించి చర్చించుకోవడానికి యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్.. ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న తెలిసిందే. సినిమాల చిత్రీకరణలు ఆపేసి, చర్చించుకుంటామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి చెప్పింది. తొలుత కౌన్సిల్ కాస్త నో నో అని అన్నా.. ఆ తర్వా గిల్డ్ నిర్ణయానికి తలూపింది. దీంతో సినిమా చిత్రీకరణలు ఆపేసి (?) చర్చలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ పెద్దల్ని, సంఘాల నాయకుల్ని కలసి నిర్మాతల తరఫున వారి ప్రతినిధులు ఆలోచనల్ని వినిపించారు.
ఈ విషయాల గురించి నిర్మాతల మండలి సభ్యులు, గిల్డ్ టీమ్ మీడియాకు ప్రకటనల రూపంలో వివరాలు ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా నిర్మాతలు కొందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రెస్ లేని ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే ప్రెస్ మీట్ అవుతున్నట్లు వాళ్లే కూర్చుని, తాము చెప్పాలనుకున్న వివరాల్ని వడ్డించేశారు. ఆ తర్వాత ఆ వీడియోను మీడియాకు పంపించి, ఇదిగో వివరాలు అని చెప్పారు. అలా మీడయా లేని మీడియా మీట్‌ను నిర్వహించారు అన్నమాట.
ఇక ఆ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం. ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, రెవెన్యూ పర్సంటేజీ, సినీ కార్మికుల వేతనాలు, నిర్మాణ వ్యయాలపై కమిటీలు పనిచేస్తున్నాయి. నెలల తరబడి షూటింగ్స్ ఆపే ఉద్దేశం నాకు లేదు’’ అని దిల్ రాజు తెలిపారు. ‘‘సమస్యల పరిష్కారం కోసమే నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశాం. నిర్మాతల మధ్య ఎటువంటి బేధాభిప్రాయాల్లేవు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ లక్ష్యం ఒకటే. సమస్యలు పరిష్కరించుకోవడమే’’ అని సి.కల్యాణ్ వివరించారు.