కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ఎన్నో చిత్రాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమాల క్రేజ్ తగ్గిపోయేలోపే ఓటిటికి అమ్మేసి చేతులు దులిపేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.’పెంగ్విన్’ ‘వి’ ‘నిశ్శబ్దం’ ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి చిత్రాలు ఈ వంకతో సేఫ్ అయిపోయాయి. అయితే డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలయ్యి సూపర్ హిట్ అయిన చిత్రాలలో ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ ముందుంటుందని చెప్పాలి.
‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రవికాంత్ పేరెపు ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి 3ఏళ్ళ క్రితమే ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే మన రానా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి ఓటిటిలో విడుదల చేసాడు. 1.3కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత సంజయ్ రెడ్డి. తరువాత ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రానా 1.8కోట్లకు ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసాడు. అటు తరువాత నెట్ ఫ్లిక్స్ వారికి 2.4 కోట్లకు మరియు ఆహా సంస్థలకు 2.2 కోట్లకు అమ్మారు.
ఇక వ్యూకౌంట్ ను ఆధారం చేసుకుని.. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం రూ.3.5 కోట్లను, ఆహా ద్వారా రూ.2.6 కోట్లను రాబట్టిందట. ఇక సినిమాకి హిట్ టాక్ రావడంతో శాటిలైట్ రైట్స్ 1.5 కోట్లకు అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 0.6 కోట్లకు అమ్ముడయినట్టు కూడా తెలుస్తుంది. ఈ రకంగా ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ చిత్రానికి మంచి లాభాలు దక్కాయని సమాచారం.