‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సినిమాలన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఆ సినిమాలు రిలీజ్ కావడానికి చాలా సమయం పడుతుంది. ప్రభాస్ తదుపరి సినిమా ‘ఆదిపురుష్’ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టలేదు.
గతేడాదిలోనే షూటింగ్ పూర్తయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం తీసుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఏడాదికి పైగా విరామం తరువాత సినిమా రిలీజ్ అవుతుండడాన్ని బట్టి చూస్తుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో కూడా ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత అశ్వనీదత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 18న లేదంటే.. 2024 సంక్రాంతికి కానీ రిలీజ్ అవుతుందని ఆయన వెల్లడించారు. అయితే ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్మాత్రం 2023 జనవరికే పూర్తవుతుందట. అంటే గ్రాఫిక్స్ కోసం ఏడాదికి పైగా సమయం తీసుకుంటున్నారు. అంతకుమించి పట్టినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ సినిమా హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో ఉంటుందని.. విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండబోతున్నాయని మేకర్స్ వెల్లడించారు. రూ.500 కోట్ల బడ్జెట్ లో ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేయబోతున్నారు. హాలీవుడ్ టెక్నిషన్స్ ఈ సినిమా కోసం పని చేయబోతున్నారు.