కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానికి కొందరు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కొంతమంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పునీత్ రాజ్ కుమార్ అభిమానులు పునీత్ మొదట వైద్యం చేయించుకున్న డాక్టర్ రమణారావు వల్లే పునీత్ మరణించాడని ఆరోపణలు చేస్తున్నారు. డాక్టర్ రమణారావు క్లినిక్ ముందు పునీత్ అభిమానులలో కొంతమంది ధర్నా చేయడం గమనార్హం. బెంగళూరు నగరంలోని రమణారావు ఇంటి దగ్గర పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు క్లినిక్ దగ్గర కూడా పోలీసులను పెట్టారు.
రమణారావును అరెస్ట్ చేయాలంటూ పునీత్ అభిమానుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే డాక్టర్ రమణారావు మాత్రం పునీత్ కు ముందునుంచి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పుకొచ్చారు. 35 సంవత్సరాల నుంచి రాజ్ కుమార్ ఫ్యామిలీకి తాను డాక్టర్ గా పని చేస్తున్నానని రమణారావు వెల్లడించారు. పునీత్ రాజ్ కుమార్ చికిత్సకు సంబంధించి తమవైపు నుంచి ఎలాంటి లోపం జరగలేదని రమణారావు పేర్కొన్నారు. జిమ్ చేసిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ సుస్తిగా ఉందని చెబుతూ 11.15 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చారని ఆస్పత్రికి వచ్చే సమయానికి పునీత్ కు చెమటలు పట్టాయని రమణారావు వెల్లడించారు.
చికిత్సకు సంబంధించి వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని రమణారావు పేర్కొన్నారు. యాంజియోగ్రామ్ పరీక్ష కోసం విక్రమ్ ఆస్పత్రిని సూచించానని ఐదు నిమిషాల్లోనే పునీత్ ఆస్పత్రికి వెళ్లేలా చూశానని రమణారావు వెల్లడించారు. రమణారావు వివరణ ఇవ్వడంతో పునీత్ ఫ్యాన్స్ శాంతిస్తారేమో చూడాల్సి ఉంది.