టాలీవుడ్ డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), గత కొంతకాలంగా నిర్మాతగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఛార్మి కౌర్ (Charmy Kaur) కాంబినేషన్ గత కొన్నేళ్లుగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీరి మధ్య వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదు, వృత్తిపరమైన బంధం కూడా బలంగా కొనసాగింది. లైగర్ (Liger) ఫ్లాప్ అయినా, ఆర్థికంగా కొంత దెబ్బతిన్నా, డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లిన ఈ ఇద్దరు, ఇప్పుడు మాత్రం వేరే దారిలో వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో, నిర్మాతలపైనా, డిస్ట్రిబ్యూటర్లపైనా ఆర్థిక ఒత్తిడి పెరిగింది. అయితే, దాన్ని పట్టించుకోకుండా డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. కానీ, ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. దీంతో పూరి మరోసారి పూర్తిగా డైరెక్షన్‌పైనే ఫోకస్ పెట్టాలని, నిర్మాతగా తాను బాధ్యతలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పూరి తన కొత్త ప్రాజెక్టులపై పని చేయడం ప్రారంభించాడని సమాచారం. అయితే, ఈసారి నిర్మాణ భాగస్వామిగా ఛార్మి ఉండబోదని టాక్ వస్తోంది. పూరి కొత్తగా ప్లాన్ చేస్తున్న సినిమాల కోసం ఇప్పటికే వేరే నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నట్లు ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో, కొందరు హీరోలు పూరితో సినిమా చేయడానికి ముందుగా ‘ఛార్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదు’ అనే షరతు పెట్టినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అయితే, పూరి-ఛార్మి జోడీ పూర్తిగా వేరు కాబోతుందా? లేదా ఈ బ్రేక్ కేవలం కొత్త ప్రాజెక్టు కోసమా అనేది తెలియాల్సి ఉంది. అలాగే వీరి గత సినిమాల ఆర్థిక లెక్కలు కూడా ఇంకా కొలిక్కి రాలేదని టాక్. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ సంబంధిత లెక్కలు ఇంకా తేలాల్సి ఉండటంతో, వీరి సంబంధం పూర్తిగా ముగిసిందని ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ, ఈ సారి మాత్రం పూరి తన దారి తాను చూసుకోవాలనే సంకల్పంలో ఉన్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.