పాత విషయం చెబుతున్నాం అని అనుకోకపోతే ఓ విషయం గుర్తు చేస్తాం. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే. ఈ మాట మేం అనేది ఎన్నో ఏళ్ల పాటు విదేశాల్లో ఆ మాటకొస్తే మన దేశంలోని నార్త్‌లో ఇదే మాట అన్నారు. అయితే కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత మొత్తం మారిపోయింది. ఈలోపు పాన్ ఇండియా ఫీవర్ వచ్చి సౌత్ సినిమా ఓ వెలుగు వెలుగుతోంది. ఎంతగా అంటే బాలీవుడ్ రికార్డును టాలీవుడ్ బద్ధలుకొట్టింది.
విడుదలకు ముందు నుండే రికార్డులు అనే పదాన్ని ఓ భుజాన వేసుకొని తిరుగుతున్నాడు ‘పుష్ప’రాజ్. ఇక విడుదలైన తర్వాత రికార్డులు బద్ధలుకొడుతూ, కొత్తవి క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏకంగా 100 ఏళ్ల చరిత్ర ఉన్న బాలీవుడ్‌లో కొత్త రికార్డు సృష్టించేశాడు. సినిమా టీమ్ అనౌన్స్ చేసిన కొత్త నెంబర్ల ప్రకారం అయితే.. హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా నిలిచింది.
‘పుష్ప: ది రూల్’ (Pushpa 2 The Rule) హిందీ నేల మీద రూ.632 కోట్లు వసూలు చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని వసూలు చేయడం మరో విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 14 రోజుల్లో రూ.1508 కోట్ల గ్రాస్ వసూలు చేసుకుంది. ఇక విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
రికార్డులు సంగతి మాట్లాడుకుంటే ఇప్పటివరకూ ‘కేజీయఫ్ 2’ (KGF 2) సినిమా ఫుల్ రన్‌లో రూ.1250 కోట్లు, ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా రూ.1,387 కోట్లు అందుకుంది. ఇక మిగిలిన రికార్డు ‘బాహుబలి 2’ (Baahubali 2) సినిమా రూ.1810 కోట్లు రికార్డు మిగిలి ఉంది. ఆ తర్వాత ‘దంగల్’ సినిమా రికార్డు గురించి ఆలోచిస్తుంది టీమ్. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ను జనవరి ఆఖరికి పంపడం వల్ల రన్‌టైమ్ పెరుగుతుంది. అంటే నిడివి కాదు.. ఆడే రోజుల సంఖ్య.