తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కు సంబంధించి కొత్త నియమావళిని ప్రవేశపెట్టింది నిర్మాతల మండలి. కుదిరితే షూటింగ్ లు వాయిదా వేసుకోమని.. లేని పక్షంలో 50 మంది సిబ్బందికి మించకుండా షూటింగ్ జరుపుకోవాలని సూచించింది. కానీ ‘పుష్ప’ షూటింగ్ మాత్రం భారీ యూనిట్ తో నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా యూసఫ్ గూడలోని ఓ కల్యాణ మండపంలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ జరిపారు. రెండు రోజుల పాటు జరిగిన ఆ షూటింగ్ లో మొత్తంగా 150 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఆ తరువాత టోలీచౌకీలో మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. భారీ ఫైట్ సీక్వెన్స్ ను తీశారు. ఈ షెడ్యూల్ లో రెండు వందల మందికి పైగా ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన సెట్స్ పైకి వచ్చాడు. అలానే సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తోన్న అనసూయ కూడా సెట్స్ పైకి వచ్చింది. వీళ్లతో బన్నీ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షూటింగ్ మొత్తం దాదాపు 150 నుండి 200 మంది సిబ్బందితో జరిగినట్లు తెలుస్తోంది.
నిజానికి ‘పుష్ప’ పెద్ద సినిమా కాబట్టి ఇంతమంది సిబ్బంది లేకపోతే పనులు సరిగ్గా జరగవు. కానీ ఇప్పటికే టాలీవుడ్ లో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. స్టార్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి వాళ్లే తమ సినిమాలను పక్కన పెట్టి ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో రూల్స్ ని అతిక్రమించి షూటింగ్ లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి బన్నీ ఇప్పటికైనా.. తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్మాతల మండలి రూల్స్ ను ఫాలో అవుతారేమో చూడాలి!