టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ (Siddharth) , తాజాగా మిస్ యూ (Miss You) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమకథా చిత్రాల జానర్ లో సిద్ధార్థ్ కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉన్నప్పటికీ, ఈసారి ఆయనకు బాక్సాఫీస్ వద్ద కష్టకాలం ఎదురైంది. రాజశేఖర్ (N. Rajasekar) దర్శకత్వంలో తెరకెక్కిన మిస్ యూ సినిమాలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్ గా నటించింది. అయితే సినిమా విడుదలకు ముందు ఉన్న మోస్తరు హైప్ కేవలం కోలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైంది. తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదట్లో యావరేజ్ హిట్ అవుతుందని భావించినప్పటికీ, కలెక్షన్ల విషయంలో పూర్తిగా విఫలమైంది. విడుదలైన నాలుగు రోజుల్లో కేవలం రూ.2.39 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. నాలుగో రోజు వసూళ్లు మరింత దారుణంగా రూ.41 లక్షల వరకే పరిమితమయ్యాయి. ఈ లెక్కన చూస్తే మిస్ యూ చిత్రం పూర్తిగా ఫ్లాప్ గా నిలిచినట్లే. ఇదే సమయంలో, సిద్ధార్థ్ ఇటీవల పుష్ప 2 ప్రమోషన్ల గురించి చేసిన కామెంట్లు పెద్ద వివాదానికి దారితీశాయి.
“పుష్ప 2 (Pushpa 2: The Rule) లాంటి పెద్ద సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చే జనాలు సినిమాపై ఆసక్తితో కాదని, జేసీబీ పని చూసేందుకు వచ్చినట్లే వస్తారని” వ్యాఖ్యానించడంతో, ఆయనపై బన్నీ ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ప్రభావం మిస్ యూ చిత్రానికి కూడా తప్పకుండా పడిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూలు చేస్తుండగా, సిద్ధార్థ్ మిస్ యూ చిత్రం కేవలం రూ.2 కోట్ల దగ్గరే నిలిచిపోవడం ఆ రెండు చిత్రాల మధ్య స్పష్టమైన కాంపారిజన్‌ను తెచ్చింది.
ఒకప్పటి స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న సిద్ధార్థ్, ప్రస్తుతం తన వ్యాఖ్యల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సిద్ధార్థ్ గతంలో బొమ్మరిల్లు (Bommarillu) , నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు. కానీ తాజా చిత్రాలు ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.