కొన్ని సినిమాలు థియేటర్‌లో చూడాలి… ఈ మాట అంటే అందరికీ నచ్చకపోవచ్చు. అయితే థియేటర్‌లో ఆ సినిమా చూడాలి, అందులోనూ వందలాది మంది ఉన్న థియేటర్‌లో ఆ సినిమా చూస్తేనే కిక్ అనే మాటను నిరూపించడానికి ఓ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అంత గొప్ప సినిమా ఇప్పుడేముంది అనుకుంటున్నారా? ఉంది… అయితే అది రిలీజ్ కాదు, రీరిలీజ్. భారతీయ సినిమా చరిత్రలో ఓ పేజీని సోలోగా కేటాయించుకున్న ఆ సినిమానే ‘పుష్పక విమానం’.
కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ సినిమా (Pushpaka Vimanam) ‘పుష్పక విమానం’. కన్నడలో నిర్మితమై… దేశంలో వివిధ భాషల్లో విడుదలైన ఆ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. ఏముంది రీరిలీజ్ ట్రెండ్ కాబట్టి చేస్తున్నారు అనుకోవచ్చు. నిజమే కానీ ఈ సారి సినిమాను చాలా పెద్ద అంచనాలతోనే చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
అయితే, ఈ సినిమాను థియేటర్లలో చూడాలి అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎందకు చూడాలి అనే చర్చ మొదలైంది. నిజంగా ఆ సినిమా అంత గొప్ప సినిమానా అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్న వాళ్లందరికీ సీనియర్ సినీ గోయర్స్ చెబుతున్న మాట ‘అప్పుడు మిస్ అయ్యారేమో… ఇప్పుడు మిస్ అవ్వొద్దు’ అని. అవును ఆ సినిమాను ఆ రోజుల్లో థియేటర్లలో ఎంజాయ్ చేసినవాళ్లు ఆ వైబ్స్‌ను థియేటర్లలో ఇప్పుడూ చూడాలని ఆశపడుతున్నారు.
కమర్షియల్ హీరోలు ప్రయోగాలు చేయడం అరుదు. కమల్ హాసన్ మాత్రం వేరే. ఆయన అలాంటివే చేస్తుంటారు. అలా ఆయన చేసిన మూకీ ప్రయోగం ‘పుష్పక విమానం’. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందిచిన సినిమా ఇది. కేవలం సైగలతోనే సినిమా అంతా సాగుతుంది. ఇంట్లో ఒంటరిగానో, నలుగురైదుగురు కుటుంబ సభ్యులతోనే చూస్తే ఆ సినిమా ఎఫెక్ట్ తెలియదు అంటున్నారు సీనియర్లు. మాటలల్లేని సినిమా నవ్వులు థియేటర్లలో ఆస్వాదించాలి అంటున్నారు. అన్నట్లు రూ.35 లక్షల్లో ఈ సినిమా తీస్తే రూ. కోటి వసూలు చేయడం ఈ సినిమా రికార్డు.