బాలీవుడ్ నష్టాల్లో ఉంది ఇదేం కొత్త విషయం కాదు. గత కొన్ని నెలలుగా ఈ విషయం వింటూనే ఉన్నాం. అయితే బాలీవుడ్ నష్టాలు, కష్టాలు ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల మీద పడ్డాయి. బాలీవుడ్ నుండి రీసెంట్‌గా వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఫలితంతో మల్టీప్లెక్స్‌లు చెయిన్‌లు భారీగా నష్టపోయాయి. టికెట్‌ల విషయంలోనే కాదు.. స్టాక్‌మార్కెట్‌లోనూ ఈ నష్టం కనిపిస్తోంది. దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ చెయిన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ ఒక్క రోజులోనే సుమాకు రూ. 800 కోట్లు నష్టపోయిందట.
‘బ్రహ్మాస్త్ర’ సినిమా వస్తోంది.. మళ్లీ బాలీవుడ్ విజయాల బాటపడుతుంది, దీంతో మల్టీప్లెక్స్‌ల్లో వసూళ్లు పెరుగుతాయి అనే పాజిటివ్ బజ్ ఈ మధ్య కాలంలో వినిపించింది. దీంతో స్టాక్‌మార్కెట్లలో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు పెరుగుతూ వచ్చాయి. ఎంతగానో ఎదురుచూసిన ‘బ్రహ్మాస్త్ర’ రావడం దారుణ పరాజయం పాలవ్వడంతో పీవీఆర్, ఐనాక్స్ షేర్లు అమాంతం పడ్డాయి. దీంతో ఆ రెండు స్టాక్ మార్కెట్‌లో సుమారు రూ. 800 కోట్లు కోల్పోయాయి. పీవీఆర్, ఐనాక్స్ షేర్లలో సుమారు ఐదు శాతం తగ్గుదల కనిపించింది.
ఈ సినిమా విడుదలకు ముందు రెండు షేర్లలో సుమారు నాలుగు శాతం పెరిగింది. ఇప్పుడు సినిమా పోవడంతో అమాంతం షేరు విలువ తగ్గిపోయింది. దేశంలో వందలకొద్దీ సినిమా స్క్రీన్లను నడుపుతున్న మల్టీప్లెక్సు కంపెనీల షేర్ల శుక్రవారం పరిస్థితి ఇదీ. శుక్రవారం పీవీఆర్ షేరు 5 శాతం, ఐనాక్స్ షేరు 4.86 శాతం మేర క్షీణించాయి. పీవీఆర్ షేరు విలువ ఇవాల్టి ట్రేడింగ్‌లో 1,833 వద్ద ముగిసింది. ఐనాక్స్ షేరు రూ.494.90 వద్ద స్థిరపడింది.
ఇక తొలి రోజు ‘బ్రహ్మాస్త్ర’కు మంచి వసూళ్లే వచ్చాయి. సుమారు రూ. 71 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం వెల్లడించింది. అయితే రెండో రోజు ఉదయం చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు అంటున్నారు. మళ్లీ సోమవారం మార్కెట్లు ఓపెన్ అయితే వీటి క్షీణత ఎలా ఉంటుందో అనే ఆందోళన మొదలైంది.