పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తున్నా.. ఎక్కడా పాన్ ఇండియా స్టార్ అనే ముద్ర పడని నటుడు మాధవన్ (R.Madhavan). ఎందుకంటే ఆయన చేసే సినిమాలు కమర్షియల్ హంగులతో ఉండవు మరి. అయితేనేం ఆయనంటే దేశం మొత్తం అభిమానిస్తుంది. దానికి ఆయన నటన, ఎంచుకునే కథలే కారణం. ఆ విషయం పక్కనపెడితే రీసెంట్‌గా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆయన తన భయాల గురించి చెప్పారు మరి.
పైన చెప్పినట్లు భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మాధవన్ ఇప్పుడు ‘హిసాబ్ బరాబర్’ అనే సినిమా రెడీ చేశారు. జీ 5లో ఈ విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అలా తన కెరీర్ గురించి కూడా చెప్పారు. మరికొన్ని గంటల్లో తన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందంటే భయాందోళనకు గురవుతానని చెప్పారాయన.
కెరీర్‌లో రెండే క్షణాలు నరాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయని చెప్పారు మాధవన్. కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు, ఆ సినిమా విడుదల మొదటి రోజు ఆందోళన కలుగుతుంది అని చెప్పారు. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే ‘నీ గేమ్ ఓవర్’ అని ప్రేక్షకులు, పరిశ్రమ జనాలు అంటారేమోనని భయపడతాను అని మాధవన్ తన ఆలోచనల గురించి పంచుకున్నారు. అలా పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగడం సులభం కాదు అని చెప్పారు.
ఈ విషయంలో తాను అదృష్టవంతుడినని, తనను ఎంతోమంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పారాయన. కొన్ని కథలు ఎనిమిది ఎపిసోడ్‌లంత పెద్దవిగా ఉంటున్నాయి. వాటిని తగ్గించి థియేటర్‌లో విడుదల చేయలేం కదా.. ఓటీటీలే ఆ విషయంలో బెస్ట్. అలాగే కొన్ని కథలు థియేటర్లలో జనాలు చూసేంత సగటు నిడివితో తీయలేం. ‘హిసాబ్ బరాబర్’ను కూడా అలాంటి కథే. అందుకే ఓటీటీలో విడుదల చేస్తున్నాం అని చెప్పారు. అశ్వినీధీర్ తెరకెక్కించిన ‘హిసాబ్ బరాబర్’ జనవరి 24 నుండి స్ట్రీమింగ్‌కి వస్తుంది.