టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయడం కరెక్ట్ కాదని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ అధినేత సురేష్ బాబు తన ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “ఈ మధ్యనే ఓ.టి.టి లో రిలీజ్ అయిన ‘నారప్ప’ మూవీని తెలుగు రాష్ట్రాల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు.కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు.
వెంకటేష్ గారు వంటి పెద్ద హీరో నటించిన సినిమా.మేమంతా ఆ సినిమా చుడొద్దా. మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల ఇళ్ళల్లో ఓ.టి.టిలు లేవు. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం.థియేటర్ లో సినిమాని చూడడం ఓ పండగ. సురేష్ బాబు గారు వంటి పెద్ద నిర్మాతలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపి.వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడండి. నిర్మాతలూ..కొత్త సినిమాలని, పెద్ద సినిమాలని థియేటర్లలో మాత్రమే విడుదల చేయండి..
ఓటిటికి ఇవ్వకండి.కరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ..! పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్. థియేటర్స్ బతకాలి.. సేవ్ సినిమా. మనిషి ఉన్నంత కాలం థియేటర్ వుంటుంది.థియేటర్ లేకపోతే స్టార్ డమ్ లు లేవు.. ఉండవు” అంటూ చెప్పుకొచ్చారు.