విప్లవ చిత్రాల కథానాయకుడు, డైరెక్టర్ ఆర్.నారాయణ మూర్తి నంది అవార్డుల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు సంస్కృతి, విలువలు, మానవీయతకు అద్దంపట్టిన చిత్రాలకు నంది అవార్డులు ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు అవార్డులు అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయని విమర్శించారు.
“అన్నదాత సుఖీభవ” సినిమాను వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్‌లో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును కోరేందుకు అసెంబ్లీకి వచ్చిన ఆయన మీడియాతో అవార్డులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని వెండితెరపై చూపించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాకు నంది అవార్డు రావాల్సింది.” అని అన్నారు. అలాగే బాహుబలి పై కూడా విమర్శలు గుప్పించారు. “బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినిమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది.
ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్ సినిమా. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది” అని అవార్డుల జ్యురీ సభ్యుల తీరుని నారాయణమూర్తి తప్పుపట్టారు. మరి మూర్తి విమర్శలను అవార్డు జ్యురీ సభ్యులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.