సినిమా పరిశ్రమలో పని గంటల గురించి, పని రోజుల గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కానీ.. దీనికి ఆధ్యురాలు అంటే ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపికా పడుకొణె. రోజుకు ఎనిమిది గంటలే పని చేస్తా, ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తా, వారానికి ఇన్ని రోజులే పని ఉండాలి అని ఆమె మాట్లాడింది. పర్సనల్ లైఫ్ గురించి తాను ఇలా అంటున్నాను అని కూడా ఆమె వివిధ సందర్భాల్లో నేరుగా, ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. అయితే ఆ సమయంలో ఆమె మీద పెద్ద ఎత్తున మండిపడ్డారు సినిమా ఔత్సాహికులు.
ఓ సినిమా విషయంలో ఇలా జరగడంతో ఆ సినిమా దర్శకుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సినిమా కథను లీక్ చేసేస్తున్నారు అని ఆయన అనడంతో అటువైపు కూడా తప్పుంది అని అన్నారంతా. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో వాయిస్ బాలీవుడ్ నుండి లేచింది. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి గురించి ఎప్పుడూ సూటిగా మాట్లాడే నటి రాధికా ఆప్టే సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్‌పై తన అభిప్రాయాలను వెల్లడించింది.
వరుసగా రోజులు తరబడి పిల్లలను చూడకుండా పని చేయడం సరైంది కాదు. అందుకే గతంలో చాలా సందర్భాల్లో లాంగ్ షిఫ్ట్స్‌కు నో చెప్పాను. అలా చెప్పినందుకు ఎన్నో చర్చలు, వాదనలు ఎదుర్కొన్నాను అని గతాన్ని గుర్తు చేసుకుంది రాధిక. పిల్లల కోసం నానీని పెట్టుకుని సెట్స్‌కు తీసుకురావడం అసలు పరిష్కారం కాదని రాధిక క్లారిటీ ఇచ్చింది. వర్క్ – పర్సనల్ లైఫ్ సమతౌల్యం అవసరమని, అది లేకపోతే వ్యక్తిగత జీవితం దెబ్బతింటుందని చెప్పుకొచ్చింది రాధిక.
సినిమాలను అంగీకరించినప్పుడు వర్కింగ్ అవర్స్ విషయంలో చాలా స్పష్టతతో ఉంటానని.. అందులో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేస్తానని రాధిక తెలిపింది. వారానికి ఐదు రోజులు పని, రోజుకు గరిష్ఠంగా 12 గంటలు షూటింగ్ తప్పనిసరి అని, అరుదైన సందర్భాల్లో మాత్రమే మినహాయింపులు ఇస్తానని చెప్పింది. అప్పుడూ, ఇప్పుడూ అదే పాటిస్తున్నా అని చెప్పింది. మరి దీపిక మీద నోరు చేసుకున్నవాళ్లు ఇప్పుడు రాధికను ఏమంటారో చూడాలి.
