రాఘవేంద్రరావు సినిమాలు అంటే 24 క్రాఫ్ట్‌తో పాటు మరో క్రాఫ్ట్ కూడా ఉంటుంది. అంతేకాదు ఆ క్రాఫ్ట్ ఆయన సినిమాల్లో చాలా ప్రత్యేకం కూడా. అదేదో కాదు పువ్వులు, పళ్లు. ఆయన సినిమాలో పాటలు అంటే పూలు, పళ్లు ఉండాల్సిందే. ఆ మాటకొస్తే మిగిలిన సన్నివేశాల్లో కూడా ఎక్కడో దగ్గర తొంగి చూస్తాయి. మరి దర్శకేంద్రుడు తొలిసారి పండు వాడిన సినిమా, పాట ఏదో తెలుసా? ఆయన ‘పండు’ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైందంటే?
రాఘవేంద్రరావు ఇటీవల దర్శకుడిగా 45 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. తండ్రి ప్రకాశ్‌రావు దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్న రాఘవేంద్రావు… ఆ తర్వాత ‘బాబు’తో దర్శకుడిగా మారారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయన సొంతం. అయితే రాఘవేంద్రరావు అంటే ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేది పూలు, పళ్లు. హీరోయిన్ల బొడ్డు మీద పడటానికే పండాయేమో అన్నట్లుగా ఉంటాయి మరి. ఓ హీరోయిన్ నాభిపై ద్రాక్ష, మరో నాయికపై యాపిల్… ఇలా తన సినిమాల్లోని పాటల కోసం ఆయన చాలా పళ్లు వాడేశారు.
చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ప్రధానపాత్రల్లో 1988లో ‘మంచిదొంగ’ అనే సినిమా వచ్చింది గుర్తుందా?. అందులో ‘బెడ్ లైటు తగ్గించనా…’ అనే ఓ రొమాంటిక్ గీతం ఉంటుంది. ఫస్ట్‌నైట్‌కు సంబంధించిన పాట అది. అన్ని పాటల్లా ఉండకూడదని రాఘవేంద్రరావు కొత్తగా ప్లాన్ చేశారట. పాట ఎలా ఉండాలనుకుంటున్నారో… చూచాయగా సంగీత దర్శకుడు చక్రవర్తికి చెప్పి ట్యూన్ సిద్ధం చేయించారు. ఫస్ట్ నైట్ సీన్ కాబట్టి విద్యుదీపాలు చూపించాల్సిందే. అందుకే లైట్ ఆన్ చేసినపుడు ఓ బీట్, ఆఫ్ చేసినపుడు మరో బీట్ వచ్చేలా పాట రూపొందించారు. దాంతోపాటే పళ్లు, పూలు కూడా వినియోగించారు. అలా రాఘవేంద్రరావు సినిమాలో విజయశాంతిపై తొలి పండు పడిందన్నమాట.