హీరోలుగా కెరీర్లు మొదలుపెట్టి అనంతరం దర్శకులుగా మారిన చిన్న లిస్ట్ లో రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) పేరు మొదటి వరుసలో ఉంటుంది. “చిలసౌ”తో సూపర్ హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్.. అనంతరం “మన్మథుడు 2” (Manmadhudu 2) ఫ్లాప్ అవ్వడం వల్ల దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి మళ్లీ నటుడిగా బిజీ అయ్యాడు. మధ్యలో హీరోగా ఒక మలయాళ రీమేక్ లో నటించాడు రాహుల్. ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో వసన్ బాలా (Vasan Bala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “జిగ్రా”.
తమ్ముడిని జైల్ నుంచి రక్షించుకోవడం కోసం అక్క పడే తపన ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ ఓ కీలకపాత్ర పోషించాడు. హిందీతోపాటు మిగతా భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. ఇకపోతే.. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో మూడో సినిమాగా మొదలైన “ది గర్ల్ ఫ్రెండ్” ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) టైటిల్ పాత్రధారిణిగా మొదలైన ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకుని అనంతరం ఎందుకో గ్యాప్ తీసుకున్నారు.
మరి ఇప్పుడైనా రాహుల్ రవీంద్రన్ మళ్లీ గర్ల్ ఫ్రెండ్ పనులు మొదలెడితే బాగుంటుంది. లేకపోతే.. ఆయన కూడా సముద్రఖని (Samuthirakani) , ఎస్.జె.సూర్య (S. J. Suryah) లాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోతాడేమో. ఎందుకంటే.. ప్రస్తుతం తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత అయితే ఉంది, అందుకే పరభాషా నటుల్ని అరువు తెచ్చుకుంటున్నారు. రాహుల్ తెల్ల గెడ్డం లుక్ కూడా ఒకందుకు దర్శకులను ఆకర్షిస్తోంది. అయితే..
మనోడి చాక్లెట్ బాయ్ ఫేస్ మాత్రం అతడ్ని పూర్తిస్థాయి విలన్ రోల్స్ చేయనివ్వడం లేదు. ఆ ఒక్క విషయాన్ని రాహుల్ అధిగమించగలిగితే తెలుగు మాత్రమే కాదు సౌత్ లో మోస్ట్ వాటెండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇకపోతే.. “జిగ్రా” అక్టోబర్ 11న హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది.