సూటిగా విషయానికొచ్చేద్దాం… ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో వచ్చి నాతో సినిమా చేస్తావా అనడిగితే నో చెప్పే దర్శకుడు ఉంటారా? అంతటి ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి. కానీ ఓ దర్శకుడు నో చెప్పారు. దానికి ఆమిర్ కూడా ‘యాజ్ యు విష్’ అంటూ చెప్పేసి కామ్ అయిపోయారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ విషయాన్ని ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘బాహుబలి’ తర్వాత ఆమిర్ ఖాన్ నుండి సినిమా ప్రస్తావన వచ్చిందట.
మహాభారతం కథను సినిమాగా చేయాలని ఆమిర్ ఖాన్ ఎప్పటి నుండో అనుకుంటున్నారు. దీని కోసం కొన్నేళ్ల క్రితం విజయేంద్రప్రసాద్‌ను సంప్రదించారట ఆమిర్. అయితే తనకు వేరే వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయని, కేవలం బేసిక్ కథ మాత్రం ఇవ్వగలనని చెప్పారట. పూర్తి కథను వేరే టీమ్‌తో రాయించుకోమని సూచించారట. దానికి ఓకే అయిన ఆమిర్ ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సిందిగా రాజమౌళిని కోరారట. దానికి రాజమౌళి స్పందిస్తూ.. చేయలేను అనేశారట. అదేంటి మహాభారతాన్ని సినిమాగా తీయాలి అనేది తన చిరకాల కోరిక అని రాజమౌళి గతంలో చాలాసార్లు చెప్పారు.
అలాంటిది ఆ అవకాశం వస్తే ఎందుకు కాదనుకున్నారు అనేగా డౌట్. ఈ డౌట్ మాకూ ఉంది. అయితే రాజమౌళి ఆలోచన వేరేలా ఉంది. అలాంటి సినిమా చేయాలంటే తనకు ఇంకా చాలా సమయం కావాలని, అందుకే ఇప్పుడు చేయలేను అని చెప్పారట రాజమౌళి. అలా రాజమౌళి – ఆమిర్ ఖాన్ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికప్పుడు తనకు చాలా సినిమాల కమిట్‌మెంట్లు ఉన్నాయని, ఈ సమయంలో ‘మహాభారతం’ తలకెత్తుకుంటే కష్టమవుతుందని రాజమౌళి అనుకున్నారట.
మహాభారతాన్ని సినిమాగా చేయాలంటే కనీసం ఐదారు భాగాలు అవుతుంది. అంతటి సమయం వెచ్చించి, డబ్బులు పెట్టేవాళ్లు కావాలి. అంత ఖర్చును తిరిగి వెనక్కిచ్చేలా వసూళ్లూ రావాలి. ఇలాంటి సినిమాలను ఆదరించేలా మన ప్రేక్షకులూ మారాలి. ఆ రోజు కోసం రాజమౌళి వెయిట్ చేస్తున్నారని టాక్.