కీరవాణి తనయుడు శ్రీ సింహా కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. ఒక సగటు సినిమాగా మొదలైన ఈ సినిమా ప్రయాణం.. ఇప్పుడు వైరల్ మూవీగా మారింది. సినిమాలో ఏదో స్టఫ్ ఉంది అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం సినిమా ప్రచార చిత్రాల్లో వైవిధ్యం, కొత్తదనం. అయితే ఈ సినిమా తొలి నాళ్లలో చేసిన ప్రచారానికి, ఇప్పటి ప్రచారానికి చాలా తేడా ఉంది. దీని వెనుక దర్శక ధీరుడు రాజమౌళి ఉన్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి తెలిపారు.
‘సూర్యకాంతం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రణీత్ బ్రహ్మాండపల్లి. ఇప్పుడు ‘భాగ్ సాలే’ సినిమాతో వస్తున్నారు. శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మత్తు వదలరా’ సినిమా చూశాక ‘భాగ్ సాలే’ కథకు శ్రీసింహా సరిగ్గా సరిపోతాడనిపించిందట ప్రణీత్‌కు. 2019లోనే ఈ కథ రాసుకున్నా.. కొవిడ్ తదితర కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంలో ఓ ఉంగరం చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ ఈ సినిమా.
సినిమాలో శ్రీసింహాది తుంటరి పాత్ర. ఈ సినిమాలో ఎక్కువ శాతం పరుగులే ఉంటాయి. అందుకే సినిమాకు ‘భాగ్ సాలే’ అనే టైటిల్ పెట్టాం అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు తొలుత ‘పరుగు’, ‘దౌడ్’ ఇలా కొన్ని టైటిల్స్ అనుకున్నారట. కానీ ‘భాగ్ సాలే’ క్యాచీగా ఉందని పెట్టారట. ‘భాగ్ సాలే’ సినిమా ట్రైలర్ చూశాక శ్రీసింహాకు (Rajamouli) రాజమౌళి ఫోన్ చేసి ‘సినిమా హిట్ అయ్యేలా ఉంది.
కాస్త పుష్ చేయండి’ అన్నారట. ఆ మాటను ప్రశంసగా తీసుకుని ముందుకెళ్తున్నాం అని ప్రణీత్ చెప్పారు. అలాగే తన తర్వాతి చిత్రం స్పోర్ట్స్ జానర్‌లో ఉంటుందని, ఆ కథను ఇటీవలే దర్శకుడు హరీష్ శంకర్‌కు వినిపించా అని చెప్పారు. హరీశ్ శంకర్‌కు ఈ సినిమా బాగా నచ్చి, ఇందులో భాగమవుతాని అని చెప్పారట.