సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పోటీ ఇతర దర్శకులతోనో, పక్కన రిలీజ్ అయ్యే సినిమాలతోనో ఉంటుంది. కానీ ‘వారణాసి’ సినిమాకు మాత్రం రాజమౌళికి పోటీ మనుషులతో కాదు, టెక్నాలజీతో ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)’ ఇప్పుడు జక్కన్న క్రియేటివిటీకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసింది. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న అసలైన సవాలు.
అసలు సినిమా ఫస్ట్ లుక్ రాకముందే, మహేష్ బాబుని రాముడిగానో, అఘోరాలాగానో చూసేయడం ఆడియన్స్ కు అలవాటైపోయింది. ఏఐ పుణ్యమా అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోస్టర్లు డిజైన్ చేసి ఇంటర్నెట్ లో వదిలేస్తున్నారు. ఒకప్పుడు దర్శకుడి ఊహే అద్భుతం. కానీ ఇప్పుడు ప్రేక్షుడి చేతిలోనే ఆ అద్భుతం ఉంది. అంటే రాజమౌళి ఏదైనా ఊహించే లోపే, అది ఎవరో ఒకరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
దీనివల్ల ఆడియన్స్ లో ‘ఎక్స్ పెక్టేషన్స్’ అనేవి ఒక రేంజ్ లో ఫిక్స్ అయిపోతున్నాయి. రాజమౌళి విజువల్స్ చూపించే సమయానికి.. “ఇది మనం ఆల్రెడీ ఇన్ స్టా రీల్స్ లో చూశాం కదా” అనే ఫీలింగ్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే, ఆయన సోషల్ మీడియాలో ఉన్న లక్షలాది మంది క్రియేటర్ల ఊహను దాటి ఆలోచించాలి.
నిజానికి ఇది ఒక్క దర్శకుడికి, నెటిజన్లకు మధ్య జరుగుతున్న “ఇన్ఫినిట్ వార్”. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ ను మరిపించేలా రాజమౌళి అవుట్ పుట్ ఉంటేనే ఆయన లెగసీ నిలబడుతుంది. లేదంటే ఈ ‘డిజిటల్ ఊహల’ ప్రవాహం ఆయనకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.
