దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విజయేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకినట్టు వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని రెండు వారాల పాటు తనకు ఎవరూ ఫోన్ చేయవద్దని విజయేంద్ర ప్రసాద్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ వయస్సు 78 సంవత్సరాలు కావడంతో రాజమౌళి ఫ్యామిలీ ఆయనకు కరోనా సోకడంపై టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో వరుసగా సినీ ప్రముఖులకు కరోనా సోకుతుండటంతో ఆ ప్రభావం పలు సినిమాల షూటింగ్ లపై కూడా పడే అవకాశం ఉంది. అల్లు అరవింద్, నివేదా థామస్ తమకు కరోనా సోకినట్టు ప్రకటించగా త్రివిక్రమ్ కు కూడా కరోనా సోకినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసిన రాజమౌళి మే లేదా జూన్ రెండవ వారం నాటికి షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్ కు కరోనా నిర్ధారణ కాగా ఆ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కు కూడా కరోనా సోకడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ సినిమాలకు కథ అందించడంతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.