సినిమానే శ్వాసగా బతికేవారికి అందించే అత్యున్నత పురస్కారం “అక్కినేని నాగేశ్వరరావు అవార్డు”ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అందుకున్నారు. ఈ అవార్డు గ్రహీతలైన అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, కె.బాలచందర్ వంటి ప్రముఖులు సరసన చేరారు. శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును రాజమౌళికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్న తరవాత రాజమౌళి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకి ఈ అవార్డు మరింత శక్తిని అందించిందని పేర్కొన్నారు. ఏఎన్‌ఆర్ గురించి గుర్తుచేసుకుంటూ ”ఏఎన్‌ఆర్ ఎంతో పట్టుదల, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఏఎన్‌ఆర్ క్యాన్సర్‌తో పోరాటం చేసి చాలా ఏళ్లు బతికారు.
అక్కినేని మృత్యువును చాలెంజ్ చేశారు. నేను రమ్మనప్పుడే నా దగ్గరకు అని చావుతో సవాల్ చేసిన వారిలో నాకు తెలిసి మహాభారతంలో భీష్మాచార్యులు ఉన్నారు, కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. అలాంటి మహానుభావుడు పేరు మీద నాకు అవార్డ్ ఇవ్వడం.. నేను ఇంకా కష్టపడాలని గుర్తుచేస్తుంది. అందుకే నా శక్తి మేర కష్టపడతాను’ అని రాజమౌళి భావోద్వేగంతో మాట్లాడారు.