సినీ రంగంలో ఎదగాలని కలలుకనే వారికి రాజమౌళి స్ఫూర్తి. అపజయం ఎరుగని డైరక్టర్ గా, బాహుబలితో తెలుగు ప్రతిభని ప్రపంచానికి చాటినా దర్శకుడిగా తెలుగువారు అతన్ని గౌరవిస్తారు. ఆ గౌరవంతోనే గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత శ్రీనివాస్ పేరిట అందించే అవార్డుల కార్యక్రమానికి రాజమౌళిని ఆహ్వానించారు. జక్కన్న ఈ వేడుకకి హాజరై 2017కిగానూ ఉత్తమ నూతన దర్శక పురస్కారానికి ఎంపికైన కొంకొణసేన్‌శర్మ కి అవార్డుని అందజేశారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. “సినీ దర్శకుడికి ముందుగా ఉండాల్సిన అర్హత ఆత్మ విశ్వాసం. ఎంతో శ్రమకోర్చి చిత్రాన్ని నిర్మించేవారికి అదే సగం బలాన్నిస్తుంది.
డబ్బును వెచ్చించే చిత్ర నిర్మాత, ఖర్చు పెట్టుకుని సినిమాకు వచ్చే ప్రేక్షకులు, చిత్రాన్ని మలిచే దర్శకుడుకి ముఖ్యం” అని వెల్లడించారు. “ప్రేక్షకులకు నచ్చే విధంగా ఒక కథను మలిచే ముందు నాకు అది నచ్చిందా? లేదా? అని ఆలోచిస్తాను. అదే నాకు అన్నింటికన్నా ముఖ్యం. ఎవరికి వారికి కథ నచ్చితేనే ఆ తర్వాత ప్రేక్షకులను థియేటరుకు ఎలా రప్పించాలో ఆలోచించాలి” అని కాబోయే దర్శకులకు సూచించారు. మూడేళ్లుగా ఈ కార్యక్రమానికి రావాలని ప్రయత్నించినా, ఇన్నాళ్లకు కుదిరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించినందుకు గొల్లపూడి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.