భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలవుతున్న రాధేశ్యామ్ సినిమా ఫలితం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి చరణ్ తారక్ లతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కించారని ఆ సినిమాలో నన్ను గెస్ట్ రోల్ లో అయినా చూపించాలని అనిపించలేదా? అంటూ ఆయననే ప్రశ్నించారు. ఒకే స్క్రీన్ పై నేను, చరణ్, తారక్ ఉంటే బాగుండేది కదా అని ప్రభాస్ జక్కన్నను అడిగారు.
మీరు అవసరం అనుకుంటే నాకోసం పాత్రను సృష్టించగలరు కదా? మీ విజన్ లో నేను కనిపించలేదా? అని ప్రభాస్ అడగగా ఆ ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెద్ద షిప్ లాంటోడని తను రాసుకున్న సీన్ లో పెద్ద షిప్ అవసరమని భావిస్తే ఆ షిప్ ను తెస్తానని జక్కన్న తెలిపారు. నేను అడిగితే నువ్వు నటిస్తావు కాబట్టి సినిమాలో ఇరికిస్తే బాగోదని సినిమాకు నిజంగా ప్రభాస్ అవసరమని భావిస్తే మాత్రం ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా కన్విన్స్ చేసేవాడినని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ప్రభాస్ రాజమౌళికి నాకంటే చరణ్ తారక్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పగా తాను ఏ సినిమా చేస్తే ఆ సినిమా సమయంలో ఆ సినిమా హీరోల కంటే మరెవరూ ఎక్కువ కాదని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఎన్టీఆర్ తో యమదొంగ తెరకెక్కించే సమయంలో ఎన్టీఆర్ హీరోగా మూడు కథలు చెప్పేవారని ఛత్రపతి సమయంలో తనకు ఒక కథ, బాహుబలి సమయంలో మూడు కథలను రాజమౌళి చెప్పారని అయితే చివరకు ఒక విషయం అర్థమైందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.
రాజమౌళి ఒక హీరోతో సినిమా చేసే సమయంలో వేర్వేరు కథలు ఆయన మైండ్ లో ఉంటాయని అవి అయ్యేవరకు గ్యారంటీ లేదని బాహుబలితో అర్థమైందని ప్రభాస్ వెల్లడించారు.