రాంచరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఇక ఈ షెడ్యూల్ లో రాంచరణ్ పై పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. రాంచరణ్ కెరీర్లోనే ‘మగధీర’ 100 మంది ఫైట్ ఎంత హైలెట్ గా నిలిచిందో… ఇది దానికి మించి ఉండేలా తెరెక్కిస్తున్నాడట మన జక్కన్న. ఇదిలా ఉండగా.. ఇటీవల హార్వార్డ్ కెన్నడీ స్కూల్‌లో నిర్వహించిన స్టూడెంట్ కాన్ఫరెన్స్‌లో రాజమౌళి పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా… విలేకరి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు రాజమౌళి. ఈ సందర్బంగా ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చాడు రాజమౌళి. ఈ చిత్రం కూడా కచ్చితంగా దేశ ప్రజలంతా చూడదగినదని రాజమౌళి చెప్పారు. ‘బాహుబలి’ మాదిరిగానే ఈ చిత్రం కూడా ‘పాన్ ఇండియా’ చిత్రమని రాజమౌళి తెలిపాడు. అయితే మిగిలిన నటీనటుల గురించి అడిగిన ప్రశ్నలకి మాత్రం జక్కన్న ఎటువంటి విషయాలు తెలుపలేదు. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ‘డీ.వి.వి.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీ.వి.వి. దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం తెలుగుతో పాటూ తమిళ, హిందీ బాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.