అపజయం ఎరుగని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. తన ప్రతి సినిమాని శిల్పం చెక్కినట్టు చెక్కుతారు. అటువంటి డైరక్టర్ మరిన్ని సినిమాలు తీస్తే ఎంతోమంది ఉపాధికి లభిస్తుంది. కానీ రాజమౌళి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏడేళ్లలో అతని నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీస్తానని బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే సినిమా తీయడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో అతను దర్శకత్వం వహించనున్న సినిమాలో గ్రాఫిక్స్ అసలు ఉండవని సమాచారం. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో చెర్రీ, తారక్ లు బాక్సర్ లుగా నటించనున్నట్టు తెలిసింది.
బాక్సింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ ని విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఇది పూర్తి అయ్యేసరికి వచ్చే సంవత్సరం ఆగస్టు అవుతుంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేయడానికి అంతే సమయం పడుతుంది. అందుకే అప్పుడే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మల్టీస్టారర్ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు.