తారకరామ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, జర్మనీ మరియు స్వీడన్‌లో రాజాసాబ్ సినిమా థియేట్రికల్ విడుదలపై స్పష్టత ఇస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ క్రింది విధంగా తెలియజేసారు.
విదేశీ థియేట్రికల్ హక్కుల కోసం అన్ని చట్టపరమైన ఒప్పందాలు, రాతపూర్వక ధృవీకరణలు, అడ్వాన్స్ చెల్లింపులతో, పూర్తి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టామని సంస్థ తెలిపింది. ఈ ఒప్పందాల ఆధారంగా థియేటర్ల బుకింగ్స్, ప్రమోషన్లు, పలు నగరాల్లో ప్రేక్షకుల చేరువకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టామని పేర్కొంది. అయితే, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆ సినిమా హక్కులను మరోకరికి కేటాయించినట్లు వివిధ వర్గాల ద్వారా తెలిసిందని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అనూహ్య పరిణామం వల్ల భారీ ఆర్థిక నష్టం, ఆపరేషనల్ సమస్యలు, అలాగే టీమ్‌కు మానసిక వేదన ఎదురైందని వెల్లడించింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా, రాజాసాబ్ సినిమా పంపిణీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తారకరామ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పష్టం చేసింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు సంస్థ హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో మార్గనిర్దేశం చేసిన తెలుగు ఫిలిం చాంబర్ ప్రతినిధులు సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు, అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే వంశీ నందిపాటి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

ఈ అంశానికి సంబంధించిన ఆర్థిక పరమైన సమస్యలను వృత్తిపరంగా ముందుకు తీసుకువెళ్లడంలో సహకరించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు టీజీ విశ్వ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు, స్పష్టత, భద్రతా చర్యలతో యూరోపియన్ ప్రేక్షకులకు నాణ్యమైన తెలుగు సినిమాలను అందించే ప్రయత్నం కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది.
