‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగానూ కర్ణాటక ప్రజల, అభిమానుల మనసుల్లో చెరుగని ముద్రవేశారు.. మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పునీత్ మొదటి వర్థంతిని పురస్కరించుకుని, ఒకరోజు ముందుగా అక్టోబర్ 28న ఆయన నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని కర్ణాటకలో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
అక్టోబర్ 27 రాత్రి బెంగుళూరులో ప్రీమియర్ షోకి వచ్చిన సెలబ్రిటీలంతా పునీత్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకి పన్నుమినహాయింపు ఇచ్చింది అక్కడి గవర్నమెంట్. పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ యానివర్సరీకి కన్నడ ప్రజలంతా ఘననివాళులర్పించనున్నారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌కి కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కార కార్యక్రమం కోసం బెంగుళూరులో భారీ ఏర్పాట్లు చెయ్యనున్నారు. కన్నడతో పాటు ఇతర భాషల నుండి హాజరయ్యే సినీ ప్రముఖులకు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సన్నాహాలు చేస్తున్నారు.
మరణించిన తర్వాత ప్రజల హృదయాల్లో నిలిచి ఉండడమే అసలైన జన్మకు అర్థం అనే మాటను అక్షరసత్యం చేశారు పునీత్. గతేడాది అక్టోబర్ 29న ఆయన కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ‘జేమ్స్’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాక, వంద కోట్ల వసూళ్లను సాధించింది. రీసెంట్‌గా కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై ఈ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడారు. ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారని అడగ్గా..
సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు హాజరవుతారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్‌కీ, పునీత్‌కీ మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. కన్నడలోనూ తారక్‌కి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పునీత్ ‘కర్ణాటక రత్న’ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ రాబోతున్నాడని స్వయంగా సీఎం చెప్పడంతో ఈ వార్తను నెట్టింట వైరల్ చేసేస్తున్నారు యంగ్ టైగర్ అభిమానులు..