సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వయసు 74 దాటినా, ఆయనలోని ఎనర్జీ, యూత్‌ఫుల్ స్పిరిట్ చూస్తే అభిమానులు ఆశ్చర్యపోవడం సహజం. వరుస సినిమాలు, దేశవ్యాప్తంగా సంచలనం రేపే ప్రాజెక్టులు చేస్తూ, ఇప్పటికీ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా కొనసాగుతున్నారు. అయితే రజనీ ఇలా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? ఆరోగ్యంగా, ప్రశాంతంగా, అనవసర ఆందోళనల లేకుండా జీవితాన్ని ఆస్వాదించేందుకు ఆయన పాటించే ప్రత్యేకమైన పద్ధతి ఏంటో ఆయన స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్య రహస్యానికి గల కారణం క్రియా యోగా అని రజనీ స్పష్టంగా తెలిపారు.
అయితే ఇది సాధారణ సాధన కాదని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దాదాపు 10-12 సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చారు. “ఆరంభంలో నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఫలితమూ దక్కలేదు. కానీ ఓ దశలో నేను పూర్తిగా లయబద్ధమయ్యాను. ఇప్పుడు ప్రతిరోజూ ధ్యానం చేయడం నా జీవితంలో భాగమైంది” అని వివరించారు. 2002లో క్రియా యోగాను ప్రారంభించినప్పటికీ, దాని అసలు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించేందుకు పదేళ్లు పట్టిందని ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. ప్రస్తుతం రజనీకాంత్ రాంచీలోని వై.వై.ఎస్ ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారు.
అక్కడ ఆయన ప్రత్యేకంగా గురువులు ఉపదేశించిన యోగా, ధ్యాన సాధన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. “ఈ ఆశ్రమంలో నేను మూడోసారి వచ్చాను. గతంలో ఇక్కడ ఒక గంట పాటు ధ్యానం చేశాను. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. ధ్యానం చేస్తున్నప్పుడు సమయమే కనబడదు. అంతగా మనస్సు స్థిరపడిపోతుంది” అని తెలిపారు. అయితే క్రియా యోగా ప్రభావాన్ని గురించి చెప్పిన రజనీ, “నన్ను కలిసినవారు నా దగ్గర నుంచి ఎంతో సానుకూలతను పొందుతామని చెబుతారు. దానికి కారణం ఇదే. ఇది ఓ రకమైన నిశ్శబ్ద సాధన.
ఇది చేసే వారికి మాత్రమే దీని ప్రభావం తెలుస్తుంది” అని వివరించారు. ఒకసారి గురువు చేతి పట్టుకుని మార్గం చూపిస్తే, ఆ మార్గం జీవితాంతం మారదని రజనీ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు కూడా రజనీ కూలీ (Coolie), జైలర్ 2 వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నా, రోజూ ఈ సాధన చేయడం వల్ల తన ఎనర్జీ మారకుండా ఉంటుందని చెబుతున్నారు. 21 ఏళ్లుగా నిరంతరంగా క్రియా యోగాను కొనసాగిస్తున్న రజనీకాంత్, తన ఆరోగ్యానికి, ఉత్సాహానికి కారణం ఇదేనంటూ చెప్పడం మరోసారి ఆయన లైఫ్‌స్టైల్ మీద ఆసక్తిని పెంచింది.