ఇంటర్వ్యూ: ‘సప్త సాగరాలు దాటి’ మూవీ గురించి హీరో రక్షిత్ శెట్టి చెప్పిన ఆసక్తికర విషయాలు

  • September 22, 2023 / 12:17 AM IST

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ రిలీజ్ చేస్తుంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రాన్ని హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 1న కన్నడలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో హీరో రక్షిత్ శెట్టి పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :

ప్ర) ‘సప్త సాగరాలు దాటి’ చాలా సింపుల్ కథ.. కానీ ఇంత ఎమోషనల్ గా డైరెక్టర్ తీయగలడు అనే నమ్మకం ఎలా కలిగింది?

రక్షిత్ శెట్టి : డైరెక్టర్ హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా. అతని ఫస్ట్ మూవీ ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో నేను నటించాను. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అని చాలా కాలం నుండి అనుకుంటున్నాడు. కానీ నేను ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘చార్లీ’ వంటి ప్రాజెక్టులతో బిజీ కావడం వల్ల అది కుదరలేదు. ‘చార్లీ’ తర్వాత ఓ మంచి ప్రేమ కథ చేయాలనుకున్నాను. అప్పుడు హేమంత్ ‘సప్త సాగర దాచే ఎల్లో'(సప్త సాగరాలు దాటి) కథ చెప్పడం, అది వర్కౌట్ అవ్వడం జరిగింది. ఈ కథని దర్శకుడు చాలా పొయెటిక్ గా ఎంతో అందంగా తీశాడు.

ప్ర) చాలా వరకు యాక్షన్ మూవీస్, హై బడ్జెట్ మూవీస్ ను మాత్రమే రెండు పార్టులుగా తీస్తారు..కానీ ఇలాంటి ప్రేమ కథని రెండు పార్టులుగా చేయాలని ఎలా అనిపించింది.

రక్షిత్ శెట్టి :మొదట రెండు భాగాలుగా చేయాలని అనుకోలేదు. అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చేయాలని అనుకున్నాను. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు,కాబట్టి ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. షూట్ అయ్యాక ఎడిటింగ్ టైంలో చూసుకున్నాక.. రెండు పార్టులు అయితే బెటర్ అని అనిపించింది. మామూలుగా మొదటి భాగం, రెండో భాగం ఎక్కువ వ్యవధిలో విడుదల చేస్తుంటారు. కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. అలా చేస్తే ఆడియన్స్ కూడా కథకి వెంటనే కనెక్ట్ అవుతారు. పార్ట్ 2 ఆ ధైర్యంతోనే చేస్తున్నాం.

ప్ర) సాధారణంగా సీక్వెల్ ఉంటే పార్ట్-1, పార్ట్-2 అన్నట్టు టైటిల్ పెడతారు.. కానీ సైడ్-A, సైడ్-B అని పెట్టడానికి కారణం?

రక్షిత్ శెట్టి : 2010 టైంలో జరిగిన కథ ఇది.ఆ టైంలో క్యాసెట్లు, సీడీ,డీవీడీ లు ఉండేవి. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి. సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం. అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చేశాం.

ప్ర) కన్నడలో తెలుగు సినిమాల ప్రభావం ఉంటుందా?

రక్షిత్ శెట్టి : కర్ణాటకలో తెలుగు సినిమాలకి విశేష ఆదరణ ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాలు విడుదలైతే కొన్ని నెలల తర్వాత వీసీఆర్ టేపుల్లో చూసేవాడిని. ఇంజనీరింగ్ రోజుల్లో, కర్నూలుకి చెందిన నా రూమ్‌మేట్‌ ద్వారా తెలుగు సినిమాల గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుసుకున్నాను. ‘వేదం’ వంటి అద్భుతమైన సినిమా గురించి అలాగే తెలుసుకున్నాను. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న చిత్రాలు ఆదరణ పొందగలవని అప్పుడు నాకు తెలిసొచ్చింది.

ప్ర) ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ వెనుక ఉన్న కథేంటి?

రక్షిత్ శెట్టి : టైటిల్ ని మేము.. ఓ మంచి కన్నడ పద్యం నుండి తీసుకున్నాము. ‘ఏడు సముద్రాలు దాటి’ అనే అర్థం వస్తుంది కాబట్టి దానికి ఫిక్స్ అయ్యాం. ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి.. అది కరెక్ట్ అనిపించింది.

ప్ర) ‘పీపుల్ మీడియా’ వారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడానికి ముందుకు రావడానికి కారణం?

రక్షిత్ శెట్టి : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో చేసే దివ్య నాకు మంచి ఫ్రెండ్. “సప్త సాగరాలు దాటి” యొక్క కన్నడ వెర్షన్‌కి ప్రశంసలు దక్కిన తర్వాత, తెలుగు వెర్షన్ కోసం వారితో కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యాం.

ప్ర) ఇలాంటి కథలు గతంలో చాలా చూశాం.. ఇందులో స్పెషాలిటీ అంటే?

రక్షిత్ శెట్టి : ఇందులో సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అద్భుతమైన సంగీతం ఉంటుంది, కథలో లీనమయ్యే బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది, సో ప్రేక్షకులు హ్యాపీగా థియేటర్‌లలో చూడదగ్గ సినిమా.

ప్ర) ఈ సినిమాని కన్నడతో పాటు ఏక కాలంలో తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదు?

రక్షిత్ శెట్టి : నిర్మాత శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ‘సప్త సాగరాలు దాటి’ చిత్రం అక్కడ రిజల్ట్ బాగుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చాక మిగిలిన భాషాల్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఛార్లీ తరహాలో ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయడం కాకుండా.. మౌత్ టాక్ బాగుంటే చేయడం బెటర్ అని అనిపించింది. ప్రేక్షకులకి కూడా పక్క భాషల్లో బాగున్న సినిమాని చూడాలి అనే ఆశ కలిగినప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

రక్షిత్ శెట్టి : ‘రిచర్డ్ ఆంథోనీ’ అనే గ్యాంగ్‌స్టర్ సబ్జెక్ట్ చేస్తున్నాను.ఆ తర్వాత ఒక ఓటీటీ ప్రాజెక్టు చేస్తున్నాను. అలాగే ‘పుణ్య కోటి’ అనే మరో పెద్ద సినిమా.. రెండు భాగాలుగా చేసే మూవీ చేస్తున్నాను.

ప్ర) స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచన ఉందా?

రక్షిత్ శెట్టి : నేను రెడీ. కానీ చిత్రనిర్మాతగా, నాకు తెలుగు భాషపై దాని సాహిత్యం, జానపదాలపై లోతైన అవగాహన వంటివి అవసరమని అనుకుంటున్నాను.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus