1986లో లాంచ్ చేయబడ్డ బజాజ్ m80 మోటార్ సైకిల్ కి ఒక మోటార్ పంప్ సెట్ ను తగిలించుకొని చిట్టిబాబు రంగస్థలంలోకి ఎంటరయ్యాడు. అందరికీ సౌండ్ వినబడుతుందేమో కానీ.. మన చిట్టిబాబుకి మాత్రం సౌండ్ కనబడుతుంది. పాపం మనోడికి చెవులు వినిబడవు అందుకే ఎదుటివారి పెదాల కదలికను బట్టి వారు ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకొంటుంటాడు. అందుకే చిట్టిబాబు సైలెంట్ గా ఉన్నాడు, ఎలాగూ వినబడదు కదా అని ఎంత మాట పడితే అంత మాట అనాలనుకొంటే మాత్రం కమెడియన్ సత్యకి పగిలినట్లుగానే జనాలకి గూబలు వాసిపోతాయన్నమాట.
కొంచం సరదా, కొంచం కోపం, కొంచం రౌద్రం రంగరించి రామ్ చరణ్ పూర్తిస్థాయి మేకోవర్ తో “రంగస్థలం” టీజర్ లో అదరగొట్టాడు. ముఖ్యంగా లాస్ట్ షాట్ లో “రంగస్థలం” గ్రామ పంచాయితీ కార్యాలయం పక్కనే ఉన్న గంగాలమ్మ తల్లి గుడి ముందు నుంచి కొణిదెల రామ్ చరణ్ కొడవలి చేతబట్టి, లుంగీ పైకి ఎగ్గట్టి వస్తుంటే.. దానికి దేవిశ్రీప్రసాద్ వైబ్రెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యేసరికి అభిమానులు “మాస్.. ఊర మాస్” అంటున్నారు. ముఖ్యంగా సెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి సుకుమార్ నుంచి ఈస్థాయి మాస్ టీజర్ కానీ ట్రీట్ మెంట్ కానీ ఎక్స్ పెక్ట్ చేయనివారందరూ ఆశ్చర్యపోతున్నారు.