Peddi: చరణ్ ‘పెద్ది’ లెక్కలు.. ఆ ఒక్క పాటతో మేకర్స్ ప్లాన్ మార్చేశారా?
- January 25, 2026 / 05:13 PM ISTByFilmy Focus Writer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే భారీ పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నారు. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. మార్చి 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, థియేట్రికల్ హక్కుల విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Peddi
సాధారణంగా భారీ చిత్రాలకు విడుదలకు ముందే వ్యాపార ఒప్పందాలు పూర్తవుతుంటాయి, కానీ ‘పెద్ది’ విషయంలో నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘చికిరి…’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క పాటతోనే ఇంతటి క్రేజ్ రావడంతో, ఇప్పుడే డీల్స్ క్లోజ్ చేయడం కంటే మున్ముందు రాబోయే టీజర్, ట్రైలర్లతో హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లి ఆ తర్వాతే భారీ రేట్లకు హక్కులను విక్రయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే వచ్చిన పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలోని స్టార్ కాస్టింగ్ కూడా సినిమా రేంజ్‌ను పెంచుతోంది. సీనియర్ నటుడు జగపతి బాబు ‘అప్పలసూరి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈ వైవిధ్యమైన నటీనటుల కలయిక సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మంచి మైలేజ్ ఇచ్చేలా ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ రూరల్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండటం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. మార్చి 27న రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
















