పవర్ స్టార్ అనే పేరు కాస్త ప్రజల నేతగా మారిపోనుంది. పవన్ కళ్యాణ్ సినిమాలను వీడి జనాల్లోకి వచ్చారు. వారి కష్టనష్టాలను తెలుసుకునేందుకు కదిలారు. నిన్నటి నుంచి తన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందుకు సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ని దర్శించుకొని ఆశీసులు అందుకున్నారు. తెలంగాణ ప్రజలు, అభిమానులు పవన్ కళ్యాణ్ చేపట్టిన చలోరే చలోరే చల్ యాత్రని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు. దీంతో రెండు రాష్ట్రాల రాజకీయ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. పవన్ కి మద్దతు తెలిపేది ఎవరో.. ఎదురు నిలిబడేది ఎవరో స్పష్టం కానుంది.
అయితే సినీ పరిశ్రమ నుంచి ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ కి మద్దతు ప్రకటించారు. జన సేన పార్టీ కి జై కొట్టారు. “బాబాయ్ చలోరే చలోరే చల్ యాత్రని అద్భుతంగా ప్రారంభించారు.” అంటూ పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే “నేను భారతీయుడిని. నా మాతృభూమిని కాపాడుకుంటాను” అనే పవన్ కొటేషన్ ని కూడా పోస్ట్ చేశారు. మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఈ పోస్ట్ స్పష్టం చేసింది. ఇక జనవరి 27 నుంచి పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా లో ఆంధ్రప్రదేశ్ ప్రజాయాత్ర చేపడతారు. అనంతపురం జిల్లాలో 3 రోజుల కరవు యాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధి బాధితులను కలవనున్నారు.