తెలుగు తొలి తరం హీరోలైనా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలకు సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. అందులో నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోని రోజురోజుకి అభివృద్ధి పరుస్తూ స్టూడియో అధినేతగా మంచి లాభాలను అందుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి నటనపై తప్ప వేరేదానిమీద దృష్టి పెట్టలేదు. ఇక అల్లు అరవింద్, నాగబాబు సినిమాలు నిర్మించినప్పటికీ సొంతంగా స్టూడియోల దిశగా ఆలోచించలేదు. ఆ దిశగా మెగా పవర్ స్టార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నిర్మాతగా అడుగుపెట్టి భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి సినిమాని తీస్తున్నారు. అదేవిధంగా మెగా స్టూడియోని నిర్మించాలని సంకల్పించారు.
ప్రస్తుతం సైరాను హైదరాబాద్ శివార్లలోని 22 ఎకరాల స్థలంలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ స్థలంలోనే స్టూడియోస్ ని నిర్మించాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. “చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహా రెడ్డి పూర్తి అయిన తర్వాత… అతను హీరోగా బోయపాటి దర్శకత్వంలో చేసిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ స్టూడియో నిర్మాణం మొదలు పెడతారు” అని మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు స్పష్టంచేశారు. పది మంది హీరోలున్న మెగా ఫ్యామిలీకి స్టూడియో తప్పనిసరి అని అభిమానులు భావిస్తున్నారు.