‘ఆర్ఆర్ఆర్’ (RRR) విజయంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తో తన సొంత మార్కెట్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2025 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా పై కోలీవుడ్ లోనూ ఆసక్తి నెలకొంది. శంకర్ (Shankar) దర్శకత్వం, చరణ్ యాక్షన్ ద్వారా ఈ చిత్రం తమిళంలో ఎంతవరకు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో చూడాలి. తమిళ సినిమా ప్రేక్షకులు స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల్ని ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చారు.
Game Changer:
అయితే ‘స్నేహితుడా’ తర్వాత శంకర్ కు అంతగా విజయాలు దక్కలేదు. ఇటీవల ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2) నిరాశపరచడంతో, ‘గేమ్ ఛేంజర్’ పై తమిళ ప్రేక్షకుల నమ్మకం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో, శంకర్ దర్శకుడిగా తన సత్తాను మరోసారి నిరూపించుకోవడానికి ఈ సినిమా కీలకంగా మారింది. తమిళంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ బిజినెస్ రూ. 15 కోట్ల వరకు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ. 35 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
ఇది శంకర్ ఇమేజ్ కి సాధ్యమేనని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే, రామ్ చరణ్ కి తమిళ ప్రేక్షకుల్లో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అనేది సినిమాకు కీలకాంశం అవుతుంది. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి తెలుగు హీరోలు తమిళనాట మంచి మార్కెట్‌ను సంపాదించారు. ‘బాహుబలి’ (Baahubali) సిరీస్, ‘పుష్ప’ (Pushpa) వంటి సినిమాలతో వీరిద్దరూ కోలీవుడ్ ఆడియన్స్ ను బాగా ఆకర్షించారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ హిట్ ఇచ్చిన రామ్ చరణ్ కి తమిళ మార్కెట్ లో సోలోగా నిలదొక్కుకోవడం పెద్ద సవాలుగా మారింది.
‘గేమ్ ఛేంజర్’ ఒక పూర్తి పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. శంకర్ సినిమా కావడంతో తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పట్ల ఆసక్తి చూపించవచ్చు. అయితే తమిళ ప్రేక్షకులు రీజనల్ ఫీలింగ్ ను అధిగమించి చరణ్ నటనను స్వాగతిస్తే, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ కోలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.