Ram Setu Review: రామ్ సేతు సినిమా రివ్యూ & రేటింగ్!
October 27, 2022 / 10:30 AM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
అక్షయ్ కుమార్ (Hero)
జాక్వలిన్ ఫెర్నాండెజ్ (Heroine)
సత్యదేవ్, నాజర్ తదితరులు.. (Cast)
అభిషేక్ శర్మ (Director)
అరుణ భాటియా - విక్రమ్ మల్హోత్రా (Producer)
డానియల్ బి.జార్జ్ (Music)
అసీమ్ మిశ్రా (Cinematography)
Release Date : అక్టోబర్ 25, 2022
వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం “రామ్ సేతు”. రాముడు నిర్మించినట్లుగా చెప్పుకొనే రామ సేతు నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని హిందీతోపాటు.. అన్నీ భారతీయ భాషల్లో అనువాద రూపంలో విడుదల చేసింది బృందం. తెలుగు నటుడు సత్యదేవ్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించడం విశేషం.
కథ: ఇండియా మరియు శ్రీలంక నడుమ ఉన్న రామ్ సేతు కారణంగా షిప్పింగ్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, ఆ సేతును కూలగొడితే కంపెనీలకు లాభమే కాక.. ప్రయాణ దూరం కూడా తగ్గుతుందని ఒక పిటిషన్ వేస్తుంది భారత ప్రభుత్వం. రామ సేతు చరిత్రను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. రిపోర్ట్ సబ్మిట్ చేసే బాధ్యతను ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఆర్యన్ (అక్షయ్ కుమార్)కు అప్పగిస్తుంది భారత ప్రభుత్వం.
తన సహచరులు సాండ్రా (జాక్వలిన్). అంజనీపుత్ర (సత్యదేవ్)తో కలిసి ఈ విషయమై రీసెర్చ్ చేస్తుండగా.. ఆర్యన్ కు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.
ఈ రీసెర్చ్ విషయంలో ఆర్యన్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని అతడు ఎలా అధిగమించాడు? “రామ సేతు” చరిత్రను, రాముడి అస్తిత్వాన్ని ఎలా నిరూపించాడు? అనేది “రామ్ సేతు” కథాంశం.
నటీనటుల పనితీరు: అక్షయ్ కుమార్ లుక్స్ పరంగా కాస్త కొత్తగా కనిపించాడు కానీ.. నటన పరంగా, మ్యానరిజమ్స్ & బాడీ లాంగ్వేజ్ పరంగా మాత్రం ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయాడు. అందువల్ల అతడు పోషించిన ఆర్యన్ క్యారెక్టర్ ఎక్కడా కొత్తగా కనిపించదు. జాక్వలిన్ కు స్క్రీన్ టైమ్ ఎక్కువ లభించినా.. నటిగా మాత్రం అలరించలేకపోయింది. సత్యదేవ్ మాత్రం తనదైన శైలి నటనతో అదరగొట్టాడు. అంజనీ పుత్రగా అతడు పాత్రలో జీవించేశాడు.
అతడి క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ కూడా బాగుంది. సినిమా మొత్తానికి ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగిన ఏకైక పాత్ర సత్యదేవ్ ది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అభిషేక్ శర్మ ఇదివరకూ కామెడీ & సెటైర్ సినిమాలు తీసిన అనుభవం “రామ్ సేతు” విషయంలో అక్కర రాలేదు. కథ-కథనం మొదలుకొని సీజీ వర్క్ వరకూ ప్రతి విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు అభిషేక్. కథనం అంత సాఫీసాగా సాగిపోవడానికి ఆంజనేయుడే వాళ్ళకి సహాయం చేశాడు అనే మ్యాజికల్ టచ్ ఇచ్చిన అభిషేక్.. ఆర్ట్ వర్క్ & సెట్ వర్క్ విషయంలో కనీస స్థాయి రీసెర్చ్ చేయకపోవడం గమనార్హం. 7000 సంవత్సరాల నాటి రాముడి అస్తిత్వాన్ని, ఇతిహాసాన్ని తెరపై చూపించేప్పుడు.. చరిత్ర గురించి బాగా రీసెర్చ్ చేసి ఉండాలి. ఇలా అరకొర కథ-కథనంతో ఈ తరహా సినిమాలు తీయడం అనేది మంచిది కాదు.
ఒక ట్రెజర్ హంట్ కథనానికి ఉండాల్సిన గృప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ సీజీ వర్క్ కానీ “రామ్ సేతు”లో కనిపించవు. 100ల కోట్ల బడ్జెట్ పెట్టినట్లుగా ఒక్క ఫ్రేమ్ కూడా కనిపించదు. ఈ విషయంలో ప్రొడక్షన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్లు దారుణంగా విఫలమయ్యాయని చెప్పాలి.
విశ్లేషణ: ఇతిహాసం గురించి సినిమా తీయాలి అనుకుంటే.. ఆ ఇతిహాసం యొక్క గొప్పదనాన్ని ముందుగా వివరించాలి, ఎలివేట్ చేయాలి. అవేమీ లేకుండా తీసిన “రామ్ సేతు” పేలవమైన కథ-కథనం-సీజీ వర్క్ కారణంగా బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. సత్యదేవ్ బాలీవుడ్ డెబ్యూతో హిట్ కొట్టలేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు.