‘అదృష్టం ఉండాలి… ఇలాంటి పాట మన జాబితాలో పడాలంటే. నిజం… విన్నాక మీరే అంటారు, చూడండి…’ నవంబరులో ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ అది. అంత గొప్ప పాట ఏంటబ్బా అని అందరూ అనుకున్నారు. కానీ ఆ పాట వచ్చాక తెగ చూసేస్తున్నారు. పాట విడుదలైన తొలినాళ్లలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఈ పాట చాలా రోజులు కొనసాగింది. అదే ‘భీమ్లా నాయక్’ సినిమాలోని ‘అడవి తల్లి మాట…’ అనే పాట. ఈ పాట గురించి రామజోగయ్య శాస్త్రి ఇటీవల వివరించారు. ఆ విషయాలు మీ కోసం.
రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాసి… తన గురువు సీతారామశాస్త్రికి వినిపించారు. ఆయన గొప్పగా ఉంది అని చెప్పారట. అయితే ఆ పాట విడుదల అయ్యేసరికి సీతారామశాస్త్రి దివంగతులు అయ్యారు. అందుకే ఆ పాటను సిరివెన్నెలకు నివాళిగా మార్చుకున్నారట రామజోగయ్య శాస్త్రి. ‘అడవి తల్లి మాట…’ పాట ఆలోచన త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారట. ‘తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకరిపైన ఒకరు కత్తులు దూసుకుంటే ఓ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుంది.
అలాంటి తల్లి ఓ అడవి అయితే? ఎలా ఉంటుంది అనే ఆలోచన పాట రాయమన్నారట. బిడ్డల పంతాలతో ఆ తల్లి పచ్చదనమే బుగ్గిపాలవుతుంటే…? ఆ అడవి ఏం చెబుతుంది అనే ఆలోచనతో పాట కావాలి అని అడిగారట. ఈ పాటకు సాహిత్యం జానపదశైలిలో ఉండాలనుకుని… తమన్‌తో కంపోజింగ్‌కి కూర్చున్నారట రామజోగయ్య శాస్త్రి. తమన్ తన కీబోర్డుతో చెట్లను నరుకుతున్నప్పుడు వచ్చే రంపపు కోత శబ్దాన్ని మోగించారట. దాన్నే బాణీగా ఎంచుకున్నారట. అప్పుడే ‘సెబుతున్నా నీ మంచి సెడ్డా… అంతోటి పంతాలు పోవాకు బిడ్డా’ అనే వాక్యం మదిలో పుట్టిందట.
ఏ తల్లైనా పోట్లాడుకుంటున్న తన బిడ్డల్ని అడ్డుకోవాలని దేవుడిని కోరుకుంటుంది. కానీ ఆ దేవుడు మౌనంగా ఉండిపోతే… ఆమెలో ఆశక్తత ఆవహిస్తుంది. ఆ విషయాన్ని తెలిపేలా ‘కిందున్న మడుసులకా కోపాలు తెమలవు / పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అని రాశారట రామజోగయ్య. చరణాల విషయంలో పాట పాత్రలకే పరిమితం కాకుండా అందరికీ చెందేలా ఉండాలని అనుకున్నారట. మానవజాతికి అడవితల్లి అందించే ఆలనాపాలనా వివరించేలా…
‘పుట్టతేనె బువ్వపెట్నా… సెలయేటి నీళ్లు జింకపాలు పట్నా… ఊడల్ల ఉయ్యాల కట్టి పెంచి… నిన్ను ఉస్తాదల్లె నించో పెట్నా’ అన్న వాక్యాలు వచ్చాయట. అలా పూర్తయిన పాటని చిత్రబృందానికి వినిపించాను. అంతా బాగుందన్నారు. ఆ తర్వాత సిరివెన్నెలకు వినిపించారట. గొప్పగా రాశావ్… అని మెచ్చుకున్నారు. అప్పట్లో దాన్నో అభినందనగానే భావించారట రామజోగయ్య. అదో ఆశీర్వాదమని ఆయన పోయాక అనిపిస్తోంది అని చెప్పారు రామజోగయ్య శాస్త్రి.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!