మహేష్ బాబుకి కరోనా సోకింది అనే వార్తతోనే సూపర్ స్టార్ అభిమానులు చాలా ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణ గారి పెద్దబ్బాయి.. మహేష్ బాబు అన్నయ్య అయిన ఘట్టమనేని రమేష్ బాబు ఈరోజు హఠాన్మరణం చెందారు. కొన్నాళ్లుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు రమేష్ బాబు. అయితే శనివారం నాడు పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని గచ్ఛబౌలిలోని ఏ.ఐ.జి(ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ) ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రికి తీసుకెళ్ళే మధ్యలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. 1977లో ‘మనుషులు చేసిన దొంగలు’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన రమేష్ బాబు మొత్తంగా 17 సినిమాల్లో నటించారు. ‘నీడ’ ‘పాలు నీళ్ళు’ ‘సామ్రాట్’ ‘చిన్ని కృష్ణుడు’ ‘బజారు రౌడీ’ ‘ముగ్గురు కొడుకులు’ ‘బ్లాక్ టైగర్’ ‘కృష్ణ గారి అబ్బాయి’ ‘ఆయుధం’ ‘కలియుగ అభిమన్యుడు’ ‘నా ఇల్లే నా స్వర్గం’ ‘మామా కోడలు’ ‘అన్నా చెల్లెలు’ ‘పచ్చతోరణం’ ‘ఎన్‌కౌంటర్’ వంటి సినిమాల్లో రమేష్ బాబు నటించారు.
అయితే ఈయన హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా మారారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలని నిర్మించిన రమేష్ బాబు అటు తర్వాత ‘దూకుడు’ ‘ఆగడు’ వంటి సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. దాంతో పాటు హిందీలో సూపర్ హిట్ అయిన ‘సూర్యవంశ్’ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈయన వయసు 56 ఏళ్ళు. రమేష్ బాబు మృతికి చింతిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.