సినిమాలో నటించే వారి పారితోషికం గురించి దాదాపు ఎవరూ మీడియా ముందు నోరు మెదపరు. వారు వీరు చెప్పుకోవడమే తప్ప కచ్చితమైన రెమ్యునరేషన్ తెలియదు. అయితే టాలీవుడ్ వర్గాల ద్వారా పారితోషికం గురించి బయటికి వస్తుంటుంది. అలా తాజాగా రమ్యకృష్ణ రెమ్యునరేషన్ గురించి చర్చించుకుంటున్నారు. 1984 లో అడుగు పెట్టిన రమ్యకృష్ణ అపజయాలకు బెదరకుండా నిలబడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సూత్రదారులు సినిమాతో నటిగా నిలబడిన ఆమె.. అల్లుడుగారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతోంది. హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లగానే ఇతర పాత్రల్లో తన ప్రతిభని చూపించి సినిమాకి బలమైంది. రీసెంట్ గా వచ్చిన బాహుబలిలో శివగామి పాత్రతో నటీనటులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఎంతంటే హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేంత.
ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్య కి అత్తగా నటించింది. ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్ బయటికి వచ్చింది. ఆమె రోజుకి ఆరు లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమాకి ఇరవై రెండు రోజులు పనిచేశారు. సో కోటి 32 లక్షలు అందుకుందని టాక్. ఇది ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన అను ఇమ్యానియేల్ కంటే రెట్టింపు పారితోషికం. అలాగే స్టార్ హీరోయిన్స్ కూడా ఒకరిద్దరు తప్ప ఇంతమొత్తంలో తీసుకోవడం లేదు. అందుకే ఆమె రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్ర టీజర్ ఈరోజు రిలీజ్ కానుంది.