నటుడిగా తనను తాను తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకొన్న రాణా తర్వాత బహు బాషల్లో పేరు సంపాదించాలన్న అత్యుత్సాహంతో హిందీలో, తమిళంలో పాత్ర పరిధి చిన్నదే అయినా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయాడు. దానివల్ల అతడి స్టార్ డమ్ కి ఎలాంటి ఉపయోగం లేకపోయినా తన ఉనికిని నిలబెట్టుకున్నాడు. అలా బహు భాషాల్లో నటించినందుకు “బాహుబలి”తో బాగా లాభపడ్డాడనుకోండి. “బాహుబలి” అనంతరం రాణా నటించిన ప్రతి చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ కుదిరితే హిందీలోనూ విడుదలవుతోంది.
రాణా తాజాగా నటించిన చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ పోలిటికల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఆరున్నరడుగుల ఆజానబాహుడు రాణా నటవిశ్వరూపం చూసి ప్రేక్షకులు విస్తుబోయారు. ముఖ్యంగా కరడుగట్టిన పవర్ ఫుల్ పొలిటీషియన్ గా, భార్య పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన మంచి భర్తగా రాణా చూపిన వేరియేషన్స్ చూసి థ్రిల్ అయ్యారు ఆడియన్స్. ఇదే ఫామ్ లో కొనసాగితే భాషతో సంబంధం లేకుండా అతి త్వరలోనే రాణా యూనివర్సల్ యాక్టర్ గా ఎదగడం ఖాయమని భావిస్తున్నారందరూ. దర్శకుడు తేజకు దాదాపు 14 ఏళ్ల తర్వాత లభించిన ఈ విజయాన్ని చిత్ర బృందమంతా ఆస్వాదిస్తున్నారు. మరోపక్క కలెక్షన్ల పరంగానూ ఇటీవల విడుదలైన చిత్రాలన్నిట్నీ బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలవడం.. భారీ స్థాయిలో కలెక్ట్ చేసే సూచనలు కనపడడం, త్వరలోనే తమిళం మరియు మలయాళంలోనూ విడుదలకానుండడంతో “నాన్ బాహుబలి” రికార్డ్ ను దక్కించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి రాజుగా, మంత్రిగా రాణా ప్రయాణం ఎంతవరకూ సాగుతుందో చూడాలి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.