సిద్ధు జొన్నలగడ్డ (Rana Daggubati) ఇప్పుడు.. కానీ 2010 వరకు సిద్ధార్థ మాత్రమే. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రెండేళ్లు అలానే కనిపించాడు, వినిపించాడు. సిద్ధార్థగా ఉన్నప్పుడు, ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మారినప్పుడు కూడా సరైన విజయం దొరక్క, విజయం దొరికినా సరైన పాత్రలు దొరక్క ఇబ్బందులు పడ్డాడు. ఈ మొత్తం ఇబ్బందులకు బ్రేక్ పడింది ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తోనే. ఆ సినిమా వెనుక ఆసక్తికర విషయాన్ని సిద్ధు ఇటీవల చెప్పుకొచ్చాడు.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడు అనే విషయం తెలిసిందే. ఆయన ముందుండి సినిమాను రిలీజ్ చేయించాడు కూడా. అయితే ఈ క్రమంలో ఆసక్తికర సంఘటనలు చాలానే జరిగాయట. ఈ విషయాన్ని సిద్ధునే చెప్పుకొచ్చాడు. రానా కొత్త టాక్ షో ‘రానా దగ్గుబాటి షో’ రెండో ఎపిసోడ్‌కి సిద్ధు, శ్రీలీల (Sreeleela) గెస్టులుగా వచ్చారు. ఈ క్రమంలోనే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ప్రస్తావన వచ్చింది.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాను ఆ రోజుల్లో రానా ఓకే చేసి అమెరికా వెళ్లి పోయాడని.. సిద్ధు గుర్తు చేసుకున్నాడు. రానా ఆరోగ్యం బాగా లేదని తెలిసి సురేశ్ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వెళ్తే.. సురేష్ బాబు తమ సినిమాను పర్యవేక్షించారని చెప్పాడు సిద్ధు. ఒక అబ్బాయి ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ఎందుకు లవ్ చేస్తాడు? ఇందులో మొత్తంగా తాగడం, నైట్ షూట్లే ఉన్నాయేంటి? అని చాలా ప్రశ్నలు అడిగారట సురేశ్‌బాబు.
అలా రానా వల్ల మొదలైన ప్రాజెక్ట్.. చివరకు సురేష్ బాబు ఇన్ స్పెక్షన్‌తో పూర్తయిందని సిద్దు చెప్పుకొచ్చాడు. అలా రానా – సిద్ధు సినిమా బయటకు వచ్చింది. మంచి పేరు సంపాదించుకుంది. సిద్ధుకు లాంచ్ ప్యాడ్ అయింది. ఇక షో విషయానికొస్తే సిద్ధు, శ్రీలీల కలసి రానాతో తెగ సందడి చేశారు. రానా ప్రశ్నలకు సిద్ధు స్పాంటేనియస్ ఆన్సర్లు, పంచ్‌లు అయితే అదుర్స్ అని చెప్పాలి.