Rana Naidu Review in Telugu: రానా నాయుడు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • March 11, 2023 / 08:16 PM IST

Cast & Crew

  • వెంకటేష్, రానా (Hero)
  • సుర్వీన్ చావ్లా (Heroine)
  • అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా, రాజేష్ జైస్, రాజేష్ కుమార్, తదితరులు (Cast)
  • సుపర్ణ్ వర్మ - కరణ్ అన్షుమన్ (Director)
  • సుందర్ ఆరోన్ - సుమిత్ శుక్లా (Producer)
  • సంగీత్ - సిద్ధార్ధ్ (Music)
  • జయకృష్ణ గుమ్మడి (Cinematography)

విక్టరీ వెంకటేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ లో వెంకటేష్-రానా కీలకపాత్రలు పోషించారు. విశేషమైన ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ కలిగిన వెంకటేష్ నటించిన ఈ సిరీస్ ఫ్యామిలీస్ చూడకూడదని పబ్లిసిటీ చేయడమే పెద్ద చర్చాంశంగా మారిన విషయం తెలిసిందే. మరి 10 ఎపిసోడ్ల అడల్ట్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!


కథ: ముంబై నగరంలో ఎలాంటి సెలబ్రిటీకి ప్రోబ్లమ్ వచ్చినా.. వెంటనే గుర్తొచ్చే పేరు రానా నాయుడు (రానా). సెలబ్రిటీలను సేఫ్ గార్డ్ చేస్తూ, ఫ్యామిలీని చూసుకుంటూ చాలా హుందాగా జీవిస్తుంటాడు. అలా సాగుతున్న లైఫ్ లోకి ఎంతరవుతాడు నాగ నాయుడు (వెంకటేష్). రానా తండ్రి నాగ అయినప్పటికీ.. ఇద్దరికీ అస్సలు పడదు.

అసలు రానా & నాగ మధ్య సమస్య ఏమిటి? ఈ ఇద్దరి నడుమ సమస్య కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ సమస్యల నుంచి రానా ఎలా బయటపడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “రానా నాయుడు.

నటీనటుల పనితీరు: రానా నాయుడు అనే పాత్రకు సరైన నటుడు రానా. ఆ పాత్రకు కావాల్సిన ఆహార్యం, క్రౌర్యం & బాడీ లాంగ్వేజ్ అన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల రానా నాయుడులో రానానే కనిపిస్తాడు. ఆ పాత్రకు తను క్యారీ చేసిన విధానం కూడా బాగుంది.

నాగ నాయుడు పాత్రలో వెంకటేష్ ను చూడ్డానికి మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చింది. వెంకటేష్ కెరీర్ కు ఒక చక్కని మైలురాయి కావాల్సిన ఈ పాత్ర ఆయనకి నెగివీటివిటీ తెచ్చిపెట్టడానికి కారణం సదరు క్యారెక్టర్ కు సరైన ఆర్క్ లేకపోవడమే. అసలు నాగను రానా ఎందుకంత ద్వేషిస్తాడు అనేందుకు సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో.. వీరిద్దరి నడుమ సాగే సన్నివేశాలు రక్తి కట్టలేదు.

సుర్వీన్ చావ్లా, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్ధి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు: క్యాస్టింగ్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, సీజీ వర్క్ వంటి టెక్నకాలిటీస్ అన్నీ బాగున్నప్పటికీ.. సిరీస్ లో ఆత్మ మిస్ అయ్యింది. ప్రతి సిరీస్ లేదా సినిమాకి ఒక డ్రైవింగ్ పాయింట్ అనేది ఉంటుంది. నిజానికి “రానా నాయుడు”కి స్పూర్తి అయిన రేయ్ డోనోవన్”కి కూడా ఒక థీమ్ & ఎయిమ్ ఉంటుంది. కానీ.. “రానా నాయుడు”లో అది లోపించింది. మరీ ముఖ్యంగా.. ఇండియన్ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయడంలో రచయితలు దారుణంగా విఫలమయ్యారు.

బూతులు కూడా సందర్భానుసారంగా కాకుండా.. కావాలని ఇరికించి చెప్పించినట్లుగా ఉన్నాయి. శృంగార సన్నివేశాల తీరు కూడా అంతే. రానా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్ధి, ప్రియా బెనర్జీ, ఫ్లోరా సైని తదితరులపై చిత్రించిన శృంగార సన్నివేశాలు కాస్త శృతి మించాయి. బూతులు, శృంగార సన్నివేశాలు వెబ్ సిరీస్ లకు కానీ, అవి చూసే ప్రేక్షకులకు కానీ కొత్త కావు. కానీ.. అసందర్భంగా, అనాలోచితంగా వాటిని ఇరికించిన విధానమే కాస్త ఇబ్బందిగా ఉంది. అప్పటికీ.. వెంకటేష్ కాంబినేషన్ లో శృంగార సన్నివేశాలను చాలా వరకూ కాస్త డీసెంట్ గా పిక్చరైజ్ చేశారు.

రానా ఎంత నొక్కి చెప్పినా వెంకటేష్ నటించిన సిరీస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూడకుండా ఉండరు. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్.. వెంకటేష్ చెప్పే బూతు డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు చూసి షాక్ అవ్వక తప్పదు. ఒక హీరో ఇమేజ్ తగ్గట్లుగా సన్నివేశాలను, మాటలను రాసుకోవడం ఎంత ముఖ్యమనే విషయాన్ని మరోసారి గుర్తుచేసిన సిరీస్ ఇది.

సిరీస్ లోని లేక్కుమిక్కిలి శృంగార సన్నివేశాలను, బూతులను పక్కన పెడితే, సిరీస్ మొత్తంలో ఆడియన్స్ ను చివరివరకూ ఎంగేజ్ చేసే అంశం ఒక్కటి కూడా లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి. దర్శకరచయితలు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

విశ్లేషణ: ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే బూతులు, శృంగార సన్నివేశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఇమేజ్ కు ఏమాత్రం సింక్ అవ్వని క్యారెక్టరైజేషన్ & కథ-కథనంలో ఆసక్తి కలిగించే అంశాలు లేకపోవడంతో “రానా నాయుడు” ఒక రొటీన్ సిరీస్ గా మిగిలిపోయింది. వెంకటేష్ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టిందనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus